భవనాశి..
రాజన్నకు పేరొస్తుందనే
పట్టించుకోవడం లేదు
భవనాశి మినీ రిజర్వాయర్‌ను పూర్తిచేస్తే.. దానికి శంకుస్థాపన చేసిన వైఎస్సార్‌కు పేరొస్తుందనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం నిధులివ్వడం లేదు. అద్దంకి సభలో మంత్రులు ఇచ్చిన మాటలు నీటి మూటలుగా మారాయి. 2014లో టీడీపీ సర్కారు, ప్రస్తుతం కూటమి సర్కారు అలసత్వంతోనే ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఇప్పటికై నా ప్రాజెక్టు పూర్తి చేసి ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
– చింతలపూడి అశోక్ కుమార్, వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి
సీఎంవోకు రాశాం
భవనాశి పనులు పూర్తి చేయడానికి అవసరమైన భూ సేకరణ (చెరువు విస్తరణ కోసం)కు మరో రూ.150 కోట్లు అవసరం అవుతాయని సీఎంఓకు నివేదిక పంపాం. నిధులు కేటాయిస్తే మళ్లీ కొత్త కాంట్రాక్టర్‌ను పిలిచి పనులు మొదలుపెడతాం. పాత కాంట్రాక్టర్ క్లోజింగ్ తీసుకున్నాడు.
– నారాయణస్వామి, ఏఈ
అద్దంకి: జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా మెట్ట భూములను సస్యశ్యామలం చేసేందుకు అద్దంకి సమీపంలోని భవనాశి చెరువును మినీ రిజర్వాయర్‌గా మార్చాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తలచారు. 2008లోనే రూ.27 కోట్ల నిధులు కూడా కేటాయించి రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. టెండర్ ప్రక్రియ అనంతరం 2013లో పనులు కూడా ప్రారంభమయ్యాయి. అనంతరం 2014లో టీడీపీ అధికారంలోకి రావడం, నిధులు కేటాయించకపోవడంతో పనులు సక్రమంగా సాగలేదు. సంవత్సరాలు గడిచేకొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయింది. భవనాశి మినీ రిజర్వాయర్ అనేది నేటికీ కలగానే మిగిలింది. 2024 ఎన్నికల సమయంలో అద్దంకి వచ్చిన మంత్రి నారా లోకేష్, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గొట్టిపాటి రవికుమార్‌లు కూటమి ప్రభుత్వం ఏర్పడితే భవనాశి ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇస్తామని హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లయినా నేటికీ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు కేటాయించలేదు. దాంతో 5 వేల ఎకరాల మెట్ట భూముల రైతుల మాగాణి కలలు కలలుగానే మిగిలిపోయాయి. ప్రాజెక్టు పూర్తయితే.. ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి మంచిపేరు వస్తుందనే ఉద్దేశంతోనే టీడీపీ పాలకులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతుల సంక్షేమం గురించి ఆలోచించకుండా రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉండటంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
250 ఎకరాల్లో భవనాశి చెరువు...
అద్దంకి సమీపంలోని శింగరకొండలో బ్రిటీష్ వారి పాలనా కాలంలో 250 ఎకరాల్లో తవ్వించిన సువిశాలమైన భవనాశి చెరువు ఉంది. ఈ చెరువు ఆక్రమణలకు గురై కుచించుకుపోయింది. దాని కింద ప్రస్తుతం హైలెవల్, లో లెవల్, ప్లగ్ హోల్ కాలువల ద్వారా దక్షిణ అద్దంకిలోని నర్రావారిపాలెం, వేలమూరిపాడు, మణికేశ్వరం, గోపాలపురం, చక్రాయపాలెం గ్రామాల్లో 1,197 ఎకరాల మాగాణి భూమి సాగవుతోంది. వెలమవారిపాలెం గ్రామం వద్ద గుండ్లకమ్మ నదికి అడ్డంగా కట్టిన చెక్ డ్యామ్ నుంచి ఫీడర్ ఛానల్ ద్వారా భవనాశి చెరువుకు నీటిని మళ్లించి మినీ రిజర్వాయర్‌గా మార్చాలని వైఎస్సార్ భావించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుతం సాగవుతున్న 1197 ఎకరాలతో పాటు చెరువుకు తూర్పు భాగంలో ఏర్పాటు చేసిన తారకరామ ఎత్తిపోతల పథకానికి పుష్కలంగా నీరందుతుంది. ఫలితంగా ప్రస్తుతం ఉన్న 1,197 ఎకరాలతో కలుపుకుని మొత్తం 5 వేల ఎకరాలు మాగాణి భూములుగా మారి సాగు నీరు అందుతుంది.
నాలుగు పనులుగా ప్రాజెక్టు...
ఈ ప్రాజెక్టును నాలుగు పనులుగా విభజించారు. వెలమవారిపాలెం వద్ద చెక్‌డ్యామ్, భవనాశి కట్ట ఎత్తు పెంచడం, భవనాశి చెరువుకు నీరు చేరే విధంగా నది నుంచి ఫీడర్ ఛానల్ నిర్మాణం, భవనాశి చెరువు విస్తరణ పనులుగా విభజించారు. ఇందులో ప్రస్తుతం చెక్‌డ్యామ్ పనులు పూర్తయ్యాయి. కాలువకు గేట్లు పెట్టే పని మిగిలి ఉంది. చెరువు కట్ట ఎత్తు పెంచే పనులు పూర్తయ్యాయి. 12.6 కిలోమీటర్ల మేర తవ్వాల్సిన ఫీడర్ ఛానల్ పనులు మూడొంతులు మాత్రమే పూర్తయ్యాయి. మూడు చోట్ల బ్లాస్టింగ్ చేయాల్సి రావడంతో ఆగిపోయాయి. చెరువు విస్తరణ పనులు పూర్తి కాలేదు. దాని కోసం 180 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రస్తుతం పనుల వ్యయం పెరిగిపోయిందని, మిగిలిన పనులు చేయలేనని చెప్పి కాంట్రాక్టర్ క్లోజింగ్ తీసుకున్నాడు. ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం అవసరమైన భూమి సేకరణకు మరో రూ.150 కోట్లు అవసరమవుతాయని ఇంజినీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సకాలంలో ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడంతో రూ.27 కోట్ల అంచనా పనులు ప్రస్తుతం వంద కోట్లకు మించే విధంగా మారాయి. ఇంకా పెరగకముందే కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని, ఎన్నికల హామీ నెరవేర్చాలని రైతులు కోరుతున్నారు.
వెలమవారిపాలెం వద్ద నిర్మించిన చెక్‌డ్యాం
గేట్లు పెట్టని కాలువ దిమ్మెలు
భవనాశి చెరువును మినీ రిజర్వాయర్‌గా మార్చేందుకు వైఎస్సార్ హయాంలోనే శంకుస్థాపన
2008లో రూ.27 కోట్ల కేటాయింపు
2013లో పనులు ప్రారంభం
2014లో టీడీపీ ప్రభుత్వం రావడంతో నిలిచిపోయిన పనులు
వైఎస్సార్‌కు పేరొస్తుందనే కారణంతో ఆటంకాలు
నేటికీ కలగా మిగిలిన భవనాశి మినీ రిజర్వాయర్
గత ఎన్నికల సమయంలోనూ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన మంత్రులు గొట్టిపాటి రవి, నారా లోకేష్
రెండున్నరేళ్లయినా అతీగతీ లేని వైనం
5 వేల ఎకరాల మెట్టభూముల రైతులకు అన్యాయం


