పొన్నలూరు:
కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న భారీ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించి, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయ ఆవరణలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కొండపి నియోజకవర్గ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో కీలకమైన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. డీఎస్సీ స్కామ్‌పై సమగ్ర విచారణ, పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి వంటి ప్రధాన డిమాండ్లతో ఈ కార్యక్రమం చేపట్టారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి సురేష్ మాట్లాడుతూ.. డీఎస్సీ పరీక్షల నిర్వహణను చంద్రబాబు ప్రభుత్వం అత్యంత బాధ్యతారాహిత్యంగా చేపట్టిందని విమర్శించారు. పారదర్శకతను గాలికొదిలేసి, ప్రశ్నాపత్రం తయారీ, డిజిటల్ నిర్వహణను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించడం ద్వారా పేపర్ లీకేజీకి ప్రభుత్వమే గట్టి పునాది వేసిందని ఆరోపించారు. జీవో నంబర్ 74కు విరుద్ధంగా తమ వారికి మేలు చేసేలా కొత్త జీవోలు సృష్టించి, స్పోర్ట్స్ కోటా పేరుతో దారుణాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. సకల శాఖల మంత్రిగా చలామణి అవుతున్న నారా లోకేష్ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే ఏళ్ల తరబడి కష్టపడి చదివిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. విద్యాహక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాడు–నేడుతో బడుల రూపురేఖలు మార్చితే.. నేడు బాబు సర్కారు అరకొర నిధులతో సరిపెడుతూ ఇంగ్లిష్ మీడియంను సైతం ఎత్తివేసి పేదలకు ఆంగ్ల విద్యను దూరం చేసిందని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చడం ద్వారా విద్యార్థులకు సుమారు రూ.9 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. నిరుద్యోగ భృతి అమలు చేయనందుకు ఒక్కో నిరుద్యోగికి ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున బాకీ పడిందని ఎద్దేవా చేశారు.
అబద్ధపు హామీలతో నిలువునా మోసం
అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా కొత్త పింఛన్లు ఒక్కటి కూడా మంజూరు చేయలేదని, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500, 50 ఏళ్లు నిండిన బీసీలకు పింఛన్లు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. గిట్టుబాటు ధరల్లేక రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రెండు నెలలుగా పొగాకు రైతులు మద్దతు ధర కోసం ఉద్యమిస్తుంటే సీఎం చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించినా ప్రజల పక్షాన తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు దుద్దుగుంట మల్లికార్జునరెడ్డి, బచ్చల కోటేశ్వరరావు, చింతపల్లి హరిబాబు, పిన్నిక శ్రీనివాసులు, ఇంకొల్లు సుబ్బారెడ్డి, ఎంపీపీ కొండాబత్తిన మాధవరావు, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, మారంరెడ్డి గంగాధర్, పరిటాల సునీల్‌కుమార్, సిరిగిరి గోపాల్‌రెడ్డి, పిల్లి తిరుపతిరెడ్డి, బద్దెల మోహన్, కొల్లిపూడి గురుబ్రహ్మ, దేవరపల్లి యశ్వంత్‌రెడ్డి, కాటా మాధవరావు, మన్నెం చినవెంకటేశ్వర్లు, యర్రా రామకృష్ణ, కనపర్తి గోవిందమ్మ, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, జ్యేష్ట వేణు, వంశీకృష్ణ, గొల్లపూడి రవణయ్య, కొమ్మలపాటి మదన్‌మోహన్, బత్తిన మనోహర్, చుండూరి సురేష్, మేదరమిట్ల భరత్‌రెడ్డి, శ్రీపతి విజయ్, తిప్పలూరి రవీంద్ర, బొడపాటి శ్రీహరి, మాకినేని హరీష్, పూనూరి సంజీవరెడ్డి, షేక్ సుల్తాన్, సామంతుల శ్రీకాంత్‌రెడ్డి, కోమట్ల వెంకారెడ్డి, లింగబత్తిన నరేష్ తదితరులు పాల్గొన్నారు.


