జీవనం భారం | - | Sakshi
Sakshi News home page

జీవనం భారం

Aug 2 2026 1:58 AM | Updated on Aug 2 2026 1:58 AM

జీతం దూరం..

జీతం దూరం..

మినిమం టైం స్కేల్‌ (ఎంటీఎస్‌) ఉపాధ్యాయులకు రెండు నెలలుగా నిలిచిన వేతనాలు

ప్రభుత్వం, విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగా టెక్నికల్‌ సమస్యలు

ప్రకాశం జిల్లాలో 200 మంది ఉపాధ్యాయులకు ఇబ్బందులు

వేతనాలు విడుదల చేయాలంటూ వేడుకోలు

ఒంగోలు సిటీ:

ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న మినిమం టైం స్కేల్‌ (ఎంటీఎస్‌) ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాలు అందకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం, విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగా తలెత్తిన సాంకేతిక కారణాలు చూపుతూ వేతనాల చెల్లింపులు నిలిపివేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే స్వల్ప వేతనాలతో జీవనం సాగిస్తున్న ఉపాధ్యాయులు.. రెండు నెలలుగా జీతాలు నిలిచిపోయి తీవ్ర స్థాయిలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో, ముఖ్యంగా మారుమూల గ్రామాల్లోని స్కూళ్లలో దాదాపు 200 మంది ఎంటీఎస్‌ ఉపాధ్యాయులు సేవలందిస్తున్నారు. జూన్‌ నెలలో బదిలీల అనంతరం కొత్త పాఠశాలల్లో చేరిన ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు జీతాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

సాంకేతిక సమస్యలంటూ సాకులు...

ఉపాధ్యాయుల తప్పిదం లేకపోయినా.. పొజిషన్‌ ఐడీల మ్యాపింగ్‌, క్యాడర్‌ స్ట్రెంత్‌ డిస్‌ప్లే, ఇతర సాంకేతిక ప్రక్రియలు పూర్తికాకపోవడంతో బిల్లులు సమర్పించలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా రెండు నెలలుగా వేతనాలు అందక వారి కుటుంబాల పోషణ, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, బ్యాంకు రుణాల చెల్లింపులు వంటివన్నీ చేసుకోలేక ఎంటీఎస్‌ ఉపాధ్యాయులు సతమతం అవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి ఆటంకం లేకుండా బోధన కొనసాగిస్తున్నామని, కానీ, కనీస వేతనాలు కూడా సకాలంలో అందకపోవడం విచారకరమని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలను సాకులుగా చూపుతూ ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు తమను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని అంటున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని పొజిషన్‌ ఐడీల మ్యాపింగ్‌, క్యాడర్‌ స్ట్రెంత్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి పెండింగ్‌ జీతాలు విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

విద్యాశాఖ అధికారుల వైఫల్యమే కారణం

ఎంటీఎస్‌ ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర ఐటీ సెల్‌లోని నిధి భవన్‌లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు నెలలుగా వారికి జీతాలు నిలిచిపోయి అవస్థపడుతున్నారు. కనీస వేతనంతో పనిచేసే ఉపాధ్యాయులకు రెండు నెలల నుంచి జీతాలు అందకపోవడానికి రాష్ట్ర విద్యాశాఖ అధికారుల వైఫల్యమే కారణం. బదిలీలు జరిగినప్పుడు వెంటనే వారి ఐడీ నంబర్లను మ్యాపింగ్‌ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర విద్యాశాఖ అధికారులపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించి ఎంటీఎస్‌ ఉపాధ్యాయుల వేతనాలను తక్షణమే చెల్లించాలి.

– షేక్‌ అబ్దుల్‌ హై, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement