● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సత్యానంద్
ఒంగోలు వన్‌టౌన్: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం అందరూ శ్రద్ధ పెట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఏ సత్యానంద్ పిలుపునిచ్చారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆయుష్ శాఖ సహకారంతో జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముందుగా జిల్లాలోని జ్యుడీషియల్ అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం వైద్య శిబిరాన్ని సత్యానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత న్యాయ సేవలతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడే కార్యక్రమాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్ శాఖ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బ్రమరాంబ మాట్లాడుతూ ఆయుష్ వైద్య విధానాల ప్రాధాన్యాన్ని వివరించారు. హాజరైన న్యాయమూర్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తులు టి.రాజ్యలక్ష్మి, పి.లలిత, పూర్ణిమ, శైలజ, కే శ్యాంబాబు, డి.దీన, సీనియర్ సివిల్ న్యాయమూర్తులు వి.పల్లవి, సీహెచ్‌వీ రామకృష్ణ, జూనియర్ న్యాయమూర్తులు పాల్గొన్నారు. శిబిరంలో పలువురు వైద్య సేవలను వినియోగించుకున్నారు.


