అద్దంకి: ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదుగానీ వృద్ధురాలు నీటిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అద్దంకి–దర్శి రహదారిలోని గుండ్లకమ్మ వంతెనపై శనివారం జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. మండలంలోని చెరువుకొమ్ముపాలేనికి చెందిన మలాది కోటేశ్వరమ్మ (80)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఓ కుమారుడు గుంటూరులో ఉద్యోగ రీత్యా నివాసం ఉంటున్నాడు. ఈమె ఆ కుమారుని వద్ద ఉంటోంది. పింఛన్ నగదు తీసుకోవడం కోసం ఇటీవల అద్దంకి వచ్చింది. పింఛన్ నగదు తీసుకుంది. ఈ క్రమంలో ఏమైందో ఏమోగానీ అద్దంకి–దర్శి రహదారిలోని గుండ్లకమ్మ వెంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈమె దూకే సమయంలో వంతెనపై నుంచి వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్ ఆమెను దూకొద్దని కేకలు వేసి దిగి వచ్చే సరికే చెప్పులు విప్పి నదిలోకి దూకింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదుతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతురాలికి మతిస్థిమితం లేకే ఇలా చేసిందని బంధువులు చెబుతున్నారు.


