ఒంగోలు టౌన్: ఊరి నుంచి వచ్చిన కుమారుడిని ఇంటికి తీసుకెళ్తుండగా కారు ఢీకొనడంతో ఒక రిటైర్డ్ టీచర్ మృతి చెందారు. ఒంగోలు తాలూకా పోలీసుల కథనం ప్రకారం... నాగులుప్పలపాడు గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ నన్నపనేని రాజారావు కుమారుడు రాఘవ చైన్నెలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. శని, ఆదివారాలు సెలవు కావడంతో శుక్రవారం రాత్రి రైలులో ఒంగోలు వచ్చాడు. రాత్రి 12 గంటలకు రైల్వేస్టేషన్ వద్దకు వచ్చిన రాజారావు.. కుమారుడిని రిసీవ్ చేసుకుని బైకుపై ఇంటికి బయలుదేరారు. త్రోవగుంట దాటిన తర్వాత చీరాల రోడ్డులోకి రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఎగిరి రోడ్డు మీద పడిన రాజారావు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు రాఘవకు గాయాలయ్యాయి. వెంటనే అతడిని జీజీహెచ్‌కి తరలించి చికిత్స చేస్తున్నారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
● గ్రానైట్ కార్మికుడి మృతి
● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
సంతమాగులూరు (అద్దంకి): రెండు మోటార్ బైకులు ఎదురెదురుగా ఢీకొట్టుకున్న ఘటనలో గ్రానైట్ కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన సంతమాగులూరు గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సోం రాష్ట్రానికి చెందిన రోహిత్ అలీ (21) స్థానిక విజయసాయి గ్రానైట్‌లో పనిచేస్తుంటాడు. ఇతను మరో యువకుడు హమీద్‌తో కలిసి మోటార్ బైకుపై నరసరావుపేట వెళ్తున్నారు. ఈ క్రమంలో బైకు లక్ష్మీపురం సమీపంలోకి చేరుకోగానే సంతమాగులూరు గ్రామానికి చెందిన మెరుగుమల్లి గోపీచంద్, మెరుగుమల్లి రాంచరణ్‌లు పయనిస్తున్న మోటార్ బైకు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో రోహిత్ అలీ మృతి చెందాడు. మిగిలిన ముగ్గురికి గాయాలు కావడంతో వారిని నరసరావుపేటలోని వైద్యశాలకు చికిత్స కోసం తరలించారు.
కంభం: రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం తెల్లవారు జామున కంభం చెరువు అలుగు సమీపంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధవీడు మండలం నాగులవరం గ్రామానికి చెందిన కె.రంగనాయకులు (50) బేల్దారి మేస్త్రిగా పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురై నాగులవరం రైల్వేగేటు సమీపంలో అలుగు వద్ద గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.


