రోడ్డెక్కిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన ప్రమాదం

Jul 31 2026 2:50 AM | Updated on Jul 31 2026 2:50 AM

పాత బస్సుల్లో ప్రయాణానికి జంకుతున్న జనం కాలం చెల్లిన పల్లె వెలుగు బస్సులు తరచూ ప్రమాదాలు.. మార్గం మధ్యలో మొండికేస్తున్న బస్సులు ఎక్స్‌ప్రెస్‌ బస్సులు సైతం మరమ్మతులకు గురవుతున్న వైనం సంతనూతలపాడు మండలంలో బోల్తాకొట్టిన బస్సు గుండ్లకమ్మ వంతెనపై ఊడిపోయిన టైర్‌

అద్దాలు ఊడిపోయి, కిటికీలు జామైన డొక్కు బస్సులు.. ఒక రేకుల డబ్బాలో గులకరాళ్లేసి ఊపినట్లు గడగడ శబ్ధంతో దూసుకుపోతుంటే జనం గుండెల్లో గుబులు.. తరచూ మరమ్మతులకు గురై నడిరోడ్డుపై ఆగిపోతున్న బస్సులు.. అసలే కండీషన్‌ లేని బస్సుల్లో పరిమితికి మించిన ప్రయాణికులు.. బస్సులు ముక్కుతూ మూలుగుతూ నడుస్తుండటంతో చిన్నపాటి ప్రమాదం జరిగినా పెద్ద నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు. పాత డొక్కు బస్సుల్లో ప్రయాణం చేయాలంటే పెద్ద సాహసం చేసినట్లుంటుందని ప్రయాణికులు వాపోతున్నారు.

ఒంగోలు టౌన్‌:

మ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 504 బస్సులు ఉన్నాయి. అందులో మార్కాపురం జిల్లాలో 303 బస్సులు, ప్రకాశం జిల్లాలో 201 బస్సులు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో పల్లె వెలుగు బస్సులు 102 ఉండగా, ఇవన్నీ 10 నుంచి 15 సంవత్సరాల కిందటివే కావడం గమనార్హం. పల్లె వెలుగు తర్వాత ప్రయాణికులు ఎక్కువగా ఎక్కేది ఎక్స్‌ప్రెస్‌ బస్సులే. ఇవి 13 ఉండగా, మరో 18 అద్దె బస్సులున్నాయి. ఇవి కూడా 10 ఏళ్ల క్రితం కొన్నవే. 48 సూపర్‌ లగ్జరీ బస్సులుండగా వాటిలో మాత్రమే కొత్త బస్సులు కనిపిస్తున్నాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో కొత్త బస్సులు కొనుగోలు చేశారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని తామే తీసుకొచ్చినట్లు రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభోత్సవాలు చేసి ప్రచారం చేసుకున్నారు.

సురక్షిత ప్రయాణాన్ని గాలికొదిలేసిన కూటమి....

గతేడాది ఆగస్టు 15వ తేదీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం అమలుకు ముందు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలంటే ఇప్పుడున్న బస్సులు సరిపోవని చెప్పిన కూటమి పాలకులు.. కొత్తగా ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయకుండానే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది కాలంలో ఒక్క బస్సు కొన్న పాపాన పోలేదు. దాంతో ఉచిత బస్సులో ప్రయాణించేవారికి నరకం కనిపిస్తోంది. బస్సు పరిమితి 60 మంది కాగా, 80 నుంచి 120 మంది వరకు ప్రయాణికులు ఎక్కుతున్నారు. అసలే డొక్కు బస్సులు కావడంతో కదల్లేకపోతున్నాయి. బస్సులో చిన్నారులు, గర్భిణులు ఊపిరాడక చాలా ఇబ్బంది పడుతున్నారని మహిళా కండక్టర్లు చెబుతున్నారు.

బస్సుల ఫిట్నెస్‌ బాగుంటేనే..

నిజానికి బస్సులను రోడ్డు మీదకు పంపించే ముందు గ్యారేజీలోనే ఫిట్నెస్‌ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. బ్రేకులు ఎలా పనిచేస్తున్నాయి.. క్లచ్‌ బాగుందా, టైర్ల పరిస్థితి ఏమిటి, స్టీరింగ్‌ బాగుందా అనేది సరిచూసుకోవాల్సి ఉంది. అన్నీ బాగుంటేనే బస్సులు గ్యారేజీ నుంచి బయటకు రావాలి. అయితే, ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు తర్వాత బస్సు కండీషన్లను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందని సిబ్బంది వాపోతున్నారు. ప్రయాణికులకు సరిపడా బస్సులు లేకపోవడంతో ఉన్న బస్సులను రోడ్డెక్కించక తప్పని పరిస్థితి ఉందని తెలుస్తోంది. దీంతో తరచూ బస్సులు మొరాయించడం, సగం దూరం ప్రయాణించాక మొండికేయడం, టైర్లు ఊడిపోవడం, స్టీరింగ్‌ జామ్‌ కావడం వంటివి జరుగుతున్నాయని ఆర్టీసీ ఉద్యోగులు కొందరు చెబుతున్నారు.

ఎక్కడ ఆగుతాయో తెలియదు...

ఈ ఏడాది మే నెలలో గిద్దలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ వెళ్లింది. తిరుగు ప్రయాణంలో మార్గం మధ్యలో ఆగిపోయింది. దాంతో బస్సులోని ప్రయాణికులను మరో బస్సు ఎక్కించి పంపించారు.

ఇటీవల మాచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మార్కాపురం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే దరిమడుగు సమీపంలోని గుండ్లకమ్మ బ్రిడ్జి వద్దకు రాగానే టైర్‌ ఊడిపోయింది. బస్సు నుంచి ఊడిపోయిన టైర్‌ సుమారు 200 మీటర్ల దూరం వరకు దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో 70 మంది వరకు ప్రయాణికులున్నారు. డ్రైవర్‌ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. అసలు విషయం తెలిసిన తర్వాత ప్రయాణికులు ప్రాణాలు అరచేత పట్టుకుని నిశ్చేష్టులుగా నిలబడిపోయారు.

అద్దంకి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు దర్శి వెళ్తోంది. మార్గం మధ్యలో శంకరాపురం వద్దకు రాగానే బస్సులోంచి పొగలు వచ్చాయి. భయపడిపోయిన ప్రయాణికులు గట్టిగా కేకలు పెట్టారు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి ప్రయాణికులను దించేశాడు. ఆ సమయంలో బస్సులో 80 మంది వరకు ప్రయాణికులు ఉండటంతో పొగలకు ఊపిరాడక ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు.

విజయవాడ నుంచి నెల్లూరు వెళుతున్న సూపర్‌ లగ్జరీ బస్సు గుడ్లూరు మండలం చేవూరు సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన టిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులున్నారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది.

బస్సు దిగిపోయిన డ్రైవర్లు...

పరిమితికి మించి రెట్టింపు ప్రయాణికులు బస్సు ఎక్కడంతో ఈ బస్సులు నడపలేమంటూ ఉమ్మడి జిల్లా పరిధిలో పలు చోట్ల డ్రైవర్లు బస్సులు నిలిపేసిన సంఘటనలూ ఉన్నాయి. పొదిలి డిపో పరిధిలో బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారు. ఎక్కడైనా బస్సు అదుపుతప్పితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఈ బస్సును నడపలేనంటూ డ్రైవర్‌ వెళ్లి పోయాడు. విషయం తెలిసిన ఆర్టీసీ డిపో మేనేజర్‌, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని బస్సు డ్రైవర్‌ను వెతికి పట్టుకుని బుజ్జగించి తిరిగి డ్యూటీకి పంపించారు. ఈ నెల 11వ తేదీ కంభం నుంచి అర్ధవీడు లోయకు వెళ్లే బస్సులో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. డోరు వద్ద వేలాడుతూ ప్రయాణం చేస్తున్నారు. డ్రైవర్‌ ఎంత చెప్పినా వినకపోవడంతో బస్సు ఆపేసి దిగిపోయాడు. ఏడు నెలల క్రితం కొండపి మండలం దాసిరెడ్డిపాలెంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ ఘటనలన్నీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయినా పాలకుల్లో ఎలాంటి చలనం లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. పరిమితికి మించిన ప్రయాణికులను పర్యవేక్షించడం శక్తికి మించిన పని కావడంతో అనారోగ్యానికి గురవుతున్నామని ఆర్టీసీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement