కనీస వేతనాల కోసం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు
ఒంగోలు టౌన్: కార్మికులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలివ్వాలని, దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో కార్మికులు కదంతొక్కారు. సీఐటీయూ రాష్ట్ర వ్యాప్త పిలుపుతో జిల్లా నలుమూలల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని కనీస వేతనాల కోసం నినదించిన కార్మికులు, ఉద్యోగులతో కలెక్టరేట్ పరిసరాలు దద్దరిల్లాయి. ఎటుచూసినా ఎర్ర జెండా రెపరెపలు కనిపించాయి. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇదే పరిస్థితి కొనసాగితే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న 55 లక్షల మంది కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ ఽవిమర్శించారు. ప్రతి ఐదేళ్లకోసారి వేతనాలను సవరించాల్సిన ప్రభుత్వాలు చట్టాన్ని తుంగలోకి తొక్కడం అన్యాయమని తప్పుబట్టారు. కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయల రాయితీలు ప్రకటించే పాలకులు.. కార్మికులకు జీవనోపాధికి సరిపడా వేతనాలు పెంచకపోవడం దారుణమని మండిపడ్డారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో బతుకు భారంగా మారిందని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రానైట్ క్వారీలు, పాలిషింగ్ యూనిట్లు, ఆక్వా కంపెనీలు, పొగాకు గోదాములు, ప్రైవేటు వైద్య విద్యా సంస్థలలో పనిచేస్తున్న కార్మికులకు 8 నుంచి 13 వేల రూపాయల వేతనాలిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 గంటల పనిదినం చట్టాన్ని ఉల్లంఘించి 12 గంటలు పనిచేయించుకుంటున్నా.. ఓవర్ టైంకు వేతనాలు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 8 గంటల పనిదినాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. పీఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ, బోనస్, చెల్లింపు సెలవులు వంటి చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని కోరారు. ఐద్వా నగర ప్రధాన కార్యదర్శి జీ ఆదిలక్ష్మి, తదితరులు మాట్లాడారు.


