ఒంగోలు నగరపాలక సంస్థ మాజీ కమిషనర్‌తో పాటు టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు వారిలో టీపీఓ, టీపీఎస్, మరో ముగ్గురు వార్డు కార్యదర్శుల సస్పెన్షన్ పదవీ విరమణ పొందిన ఏసీపీ సుధాకర్, టీపీఓ నారాయణల పెన్షన్ నిలుపుదల కార్పొరేషన్‌లో అక్రమాలపై ‘సాక్షి’లో వరుస కథనాలు
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరపాలక సంస్థలో అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గతంలోనే బీపీఎస్‌లో టౌన్ ప్లానింగ్ విభాగంలో జరిగిన అక్రమాలు, అప్పటి కమిషనర్ కే వెంకటేశ్వరరావు అవినీతి బాగోతం, భారీ దోపిడీలకు సంబంధించి ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురించింది. ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీ ‘క్రమ డబ్బీకరణ’ అనే శీర్షికతో కథనం, ఏప్రిల్ 12వ తేదీ ‘అవినీతి ఇంటింత కాదయా’, ఏప్రిల్ 13న ‘సారు..కాజేస్తున్నారు’ అనే శీర్షికలతో సాక్షి దినపత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. దాంతో ఏం చేయాలో పాలుపోని కమిషనర్ నెల రోజులు ప్రత్యేకంగా సెలవుపై ఏప్రిల్ 14వ తేదీ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులపై చర్యలు వెంటాడాయి.
కమిషనర్ సహా ఆరుగురిని సస్పెండ్ చేయాలని ఆదేశం...
ఒంగోలు నగరపాలక సంస్థలో ఎన్నడూ లేని విధంగా అవినీతి ఒక కుదుపు కుదిపింది. ఒంగోలులో భవనాల అక్రమ నిర్మాణాల విషయంలో అవినీతికి పాల్పడినట్లు తేలడంతో గతంలో కమిషనర్‌గా పనిచేసిన కే వెంకటేశ్వరరావుతో పాటు మరో ఐదుగురిపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ చర్యలకు ఉపక్రమించారు. అక్రమాలకు పాల్పడిన వారిని సస్పెండ్ చేయాలంటూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌లోని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రాయపూడి, అమరావతిలోని కార్యాలయ డైరెక్టర్‌ను ఆదేశించారు. చర్యలు తీసుకోవాలని సూచించిన వారిలో కమిషనర్ కే వెంకటేశ్వరరావుతో పాటు టీపీఓగా పనిచేస్తున్న కే బాబూరావు, టీపీఎస్‌గా పనిచేస్తున్న షేక్ రసూల్, టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి వార్డు కార్యదర్శులుగా పనిచేస్తున్న కే జోషి, శిరీష, జీ సాయి మురళీకృష్ణ ఉన్నారు. అదేవిధంగా పదవీ విరమణ చేసిన ఏసీపీ జడ్.సుధాకరరావు, టీపీఎస్ ఎన్.నారాయణరావుల పెన్షన్లు నిలుపుదల చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నార్త్ బైపాస్ రోడ్డులో అక్రమంగా కాంప్లెక్స్...
ఒంగోలు నగరంలోని నార్త్ బైపాస్ రోడ్డు, గుంటూరు రోడ్డులోని మంగమ్మ కాలేజీ జంక్షన్ వద్ద భూసేకరణ కింద ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందిన ఆర్‌అండ్‌బీ రోడ్డు స్థలంలో అనుమతులకు మించి నిర్మిస్తున్న భారీ షాపింగ్ మాల్‌లో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రూ.30 లక్షలకు పైగా లబ్ధిపొంది నిబంధనలకు విరుద్ధంగా ప్లాన్ అప్రూవల్ ఇచ్చారు. ఇంత జరుగుతున్నా ఆర్‌అండ్‌బీ అధికారులు అవినీతి రొచ్చులో పడి తెలిసీతెలియనట్లు వ్యవహరించారు. భూసేకరణ కింద నేషనల్ హైవే నుంచి నష్టపరిహారం పొంది మళ్లీ అదే స్థలంతో పాటు ఆర్‌అండ్‌బీ రోడ్డు స్థలం ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు లాడ్జ్ నిర్మాణాలు చేయగా.. వాటిపై ప్రముఖ న్యాయవాది డీఎస్ బాబు ఫిర్యాదుపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఆదేశాల మేరకు గుంటూరు ప్లానింగ్ జాయింట్ డైరెక్టర్ విచారణ చేశారు. వారి విచారణలో ఫిర్యాదు దారుడు అయిన డీఎస్ బాబు నుంచి పూర్తి వివరాలు సేకరించి బిల్డింగ్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు నిర్ధారణ కావడంతో చర్యలు చేపట్టారు.
రత్నదీప్ కమర్షియల్ కాంప్లెక్స్‌లోనూ...
నగరంలోని మంగమూరు రోడ్డులో రత్నదీప్ కమర్షియల్ కాంప్లెక్స్‌లోనూ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. ఈ భవనం విషయంలో హైకోర్టు స్టే ఆదేశాలను ధిక్కరించి కోట్ల రూపాయల లంచాలతో రాత్రికిరాత్రే అక్రమంగా బీపీఎస్ కింద రెగ్యులరైజేషన్లు చేశారు. లేబర్ సెస్ రూ.2 కోట్లు చెల్లించాలని రత్నదీప్ బిల్డింగ్‌కు డిమాండ్ నోటీసును మున్సిపల్ అధికారులు అంటించారు. అదేవిధంగా వీఎల్‌టీ ట్యాక్స్ రూ.2.40 కోట్లు చెల్లించాలని మరో నోటీసు అంటించారు. అయినా బీపీఎస్ కింద అవేమీ పట్టించుకోకుండా రెగ్యులరైజ్ చేశారు. దాంతో న్యాయవాది డీఎస్ బాబు హైకోర్టులో గత ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులపై తక్షణ ఏసీబీ/సీబీఐ దర్యాప్తు, క్రిమినల్ కేసులు, ఆస్తుల జప్తు, అక్రమ అనుమతుల రద్దు కోరుతూ పిటీషన్ వేయడంతో వారందరిపై వేటు పడింది.


