పొగాకు రైతులను మోసం చేస్తున్నసీఎం చంద్రబాబు కిలోకు రూ.20 ఇవ్వడమంటే వ్యాపారులకు లాభం చేకూర్చడమే.. రూ.128 కోట్లతో రైతులకు నష్టమే తప్ప ప్రయోజనం లేదు ముఖ్యమంత్రి మాట వినని వ్యాపారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు విమర్శలు
ఒంగోలు టౌన్: పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించమని వంద రోజులుగా పోరాడుతుంటే రూ.20 బోనస్ ఇస్తామని చెప్పడం దుర్మార్గమని, పొగాకు రైతులను మోసం చేసేందుకు సీఎం చంద్రబాబు యత్నిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పొగాకు రైతులకు రూ.128 కోట్లు బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు. లక్షల కోట్ల రూపాయల విదేశీ మాదకద్రవ్యం వస్తున్నప్పుడు రైతుల కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించలేరా అని ప్రశ్నించారు. గురువారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు వైఖరి పచ్చిబూటకమని ధ్వజమెత్తారు. పొగాకు కొనుగోలు విషయంలో మార్కెట్లో పోటీ ఏర్పాటు చేయడం ఒక్కటే పరిష్కారమని తేల్చి చెప్పారు. నెలల తరబడి పొగాకు రైతులు రోడ్డెక్కి పోరాడుతుంటే రూ.20 చేతిలో పెట్టి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. 2018లో కూడా చంద్రబాబు ఇలాగే చేశారని, గిట్టుబాటు ధరలు లేక పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అప్పుడు కూడా ఇదే విధంగా రూ.20తో మోసం చేశారని గుర్తు చేశారు. అందులో కేంద్రం వాటా రూ.15 కాగా, రాష్ట్రం తరఫున కేవలం రూ.5 మాత్రమేనని అన్నారు. ఈ ప్రకటనల ద్వారా సిండికేటైన వ్యాపారులను బాబు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వ్యాపారుల మీద ఒత్తిడి చేయకుండా రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు వైఖరిని అందరూ గమనిస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పొగాకు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలబడ్డారని చెప్పారు. రైతుల జోలికి రావడానికి వ్యాపారులు భయపడిపోయారన్నారు. కోవిడ్ మహమ్మారి వంటి సంక్షోభ సమయంలో కూడా ఆక్వా రైతులకు జగనన్న అండగా నిలిచి కాపాడారని గుర్తు చేశారు. ఆనాడు జగనన్న ఇచ్చిన ప్రోత్సాహంతో మన కంపెనీలు ప్రపంచ కంపెనీలతో పోటీపడ్డాయని చెప్పారు. ప్రభుత్వం నష్టపోవాలని కోరుకోవడం లేదని, రైతులు నష్టపోకూడదని మాత్రమే చెబుతున్నామని స్పష్టం చేశారు.
నోరుతెరిచి మాట్లాడని ఎమ్మెల్యే జనార్దన్...
పొగాకు కొనుగోలుపై ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన రివ్యూలో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులు ఉన్నారని చుండూరి రవిబాబు తెలిపారు. పొగాకు రైతుల గురించి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నోరుతెరిచి ఒక్క మాట కూడా మాట్లడలేదని విమర్శించారు. మన జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉండి కూడా ప్రయోజం లేకుండా పోయిందన్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ల బంగారుబాబు మాట్లాడుతూ జీఎస్టీ పేరుతో పొగాకు రైతులను దగా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. జీఎస్టీ తగ్గించాలని వాణిజ్య మంత్రిని కోరితే ఆమె సానుకూలంగా స్పందించారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడాన్ని తప్పుబట్టారు. జీఎస్టీ తగ్గితో వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుందిగానీ రైతులకు ఒరిగేదేమీ లేదని స్పష్టం చేశారు. రైతులను నిర్లక్ష్యం చేస్తే 2029 ఎన్నికల్లో మరిచిపోలేని విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నెం శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పాలడుగు రాజీవ్, అధికార ప్రతినిధి బెజవాడ రాము, యువజన నాయకుడు దేవా, జిల్లా కార్యదర్శి జి.రవి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి యరజర్ల రమేష్, నాయకుడు దేవరపల్లి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


