● ముండ్లమూరు మండలంలో ప్రశ్నార్థకంగా 10 వేల ఎకరాల సాగు
●రూ.88 కోట్లతో నిర్మించిన 4 ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యం
పర్యవేక్షణ లేక దొంగలపాలైన ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్ వైర్లు
గత వైఎస్సార్‌సీపీ హయాంలో సస్యశ్యామలంగా ఆయకట్టు
బాబు సర్కారు రాగానే నిరుపయోగంగా మారిన ప్రాజెక్టులు
ముండ్లమూరు: అన్నదాతల పక్షపాతిగా గొప్పలు చెప్పుకొనే కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు పాలకుల నిర్లక్ష్యంతో మూలనపడ్డాయి. ముండ్లమూరు మండలం మారెళ్ల పరిధిలోని నాలుగు ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారడంతో ఏకంగా 10 వేల ఎకరాల ఆయకట్టు బీడుగా మారి అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. తమ కళ్లెదుటే పంట పొలాలు ఎండుతున్నా కూటమి సర్కారుకు కనీసం చీమకుట్టినట్లయినా లేకపోవడం వారి రైతు వ్యతిరేక విధానాలకు అద్దం పడుతోంది.
నాడు సస్యశ్యామలం.. నేడు సర్వనాశనం
మండలంలోని మారెళ్ల, మక్కెనవారిపాలెం, జమ్మలమడక, గంగనపాలెం, సుంకరవారిపాలెం, నూజిల్లపల్లి, నాయుడుపాలెం, రామకృష్ణాపురం గ్రామాల రైతుల సాగునీటి కష్టాలు తీర్చేందుకు గుండ్లకమ్మ నదిపై నాబార్డ్ నిధులు రూ.88 కోట్లతో నాలుగు ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఒక పథకం పూర్తికాగా, ఆ తర్వాత మరో మూడు ప్రాజెక్టుల ద్వారా 9,200 ఎకరాలను సాగులోకి తెచ్చారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి ఈ పథకాలు అద్భుతంగా పనిచేశాయి. మాగాణి, ఆరుతడి పంటలతో ఆయకట్టు సస్యశ్యామలంగా కళకళలాడింది.
నిర్వహణ శూన్యం..
చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టులు నిర్వహణ లేక నిర్వీర్యమయ్యాయి. కనీస పర్యవేక్షణ కరవవడంతో ట్రాన్స్‌ఫార్మర్లు, ప్యానెల్ బోర్డులు, కేబుల్ వైర్లు దొంగలపాలయ్యాయి. పైప్‌లైన్లు పగిలిపోయి లీకవుతున్నా వాటిని బాగుచేసే నాథుడే కరువయ్యాడు. కనీసం ఆ ప్రాజెక్టుల వద్దకు వెళ్లే దారులు కూడా ముళ్లపొదలతో కప్పబడిపోయాయి.
ఆర్థిక భారంతో అన్నదాతల అవస్థలు
రూ.కోట్లు వెచ్చించిన ప్రాజెక్టులు కళ్లెదుటే శిథిలమవుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో, వర్షాలపై ఆధారపడి సుబాబుల్, జామాయిల్ తోటలు సాగు చేసుకుంటున్నారు. మరికొందరు దారిలేక గుండ్లకమ్మ నది వద్ద సొంత ఖర్చులతో ఆయిల్ ఇంజన్లు పెట్టుకుని, పైప్‌లైన్ల ద్వారా నీరు తెచ్చుకుని మొక్కజొన్న, గడ్డి పెంచుకుంటున్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ స్పందించి, చోరీకి గురైన ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి, ఎత్తిపోతల పథకాలను తక్షణమే పునరుద్ధరించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నిరుపయోగంగా మారిన ఎత్తిపోతల పధకం
ప్రాజెక్టుల వారీగా ఆయకట్టు పరిస్థితి ఇలా..


