బాలకృష్ణ అల్లుడు జూడో సర్టిఫికెట్లు ఇస్తే వాళ్లకు ఉద్యోగాలు డీఎస్సీ నియామకాల్లో పూర్తి స్థాయిలో అక్రమాల పుట్ట, అవినీతి మయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి వైఎస్సార్ సీపీ జిల్లా నాయకుల డిమాండ్
ఒంగోలు సబర్బన్: రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు దేశ చరిత్రలోనే ఎన్నడూ జరగలేదని, విద్యా శాఖ మంత్రిగా ఉన్న సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ దగా డీఎస్సీని నిర్వహించి నిరుద్యోగులను నిలువునా మోసం చేశాడని వైఎస్సార్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. పేకాటకు కూడా స్పోర్ట్స్ కోటా కల్పించి తన మనుషులకు, పార్టీ కేడర్‌కు అడ్డగోలుగా డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చాడంటే లోకేష్ మంత్రిగా పనికొస్తాడా అని ప్రశ్నించారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై, ఫీజు రీయింబర్స్‌మెంటు విధానం, నిరుద్యోగభృతి ఇవ్వని వైనాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని పార్టీ నాయకులు, నిరుద్యోగులు, విద్యార్థులు, దగాపడిన డీఎస్సీ అభ్యర్థులు ఒంగోలు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. కలెక్టరేట్‌లోని పరిపాలనాధికారి (ఏఓ) సాయి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ రెండేళ్లలో ఒక డీఎస్సీ నిర్వహించి 16 వేల ఉద్యోగాలు నిస్పక్షపాతంగా ఇవ్వలేని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒక డీఎస్సీలోనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎన్ని అక్రమాలకు, అవినీతి పాల్పడ్డాడో చెప్పనలవికాదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి విడతలోనే ఒకే సారి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి 1.36 లక్షల ఉద్యోగాలు, వైద్య విభాగంలో 50 వేల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. మొత్తంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 5.50 లక్షల నుంచి 6 లక్షల ఉద్యోగాలు నిస్పక్షపాతంగా ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దని గుర్తు చేశారు.
ఒంగోలు అసెంబ్లీ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ ఒక డీఎస్సీ సక్రమంగా నిర్వహించలేని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. డీఎస్సీ ఉద్యోగాలను వేలం పాటలో పెట్టి ఒక్కో ఉద్యోగాన్ని రూ.20 లక్షలకు అమ్ముకున్న లోకేష్ ఆ పదవికి తగడని మండిపడ్డారు. పేకాటను కూడా స్పోర్ట్స్ కోటా కిందకు తీసుకొచ్చి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఏమని సమాధానం చెబుతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ అల్లుడు భరత్‌కు జూడో అసోసియేషన్ ఉంది, రవికుమార్ అనే మరో నాయకునికి సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఉంది. వీళ్లిద్దరూ కలిసి 75 మందికి సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించుకున్నారన్నారు. 430 ఉద్యోగాలు ఒక్కో ఉద్యోగాన్ని రూ.20 లక్షల చొప్పున అమ్ముకున్నారని ధ్వజమెత్తారు.
అద్దంకి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ బాబు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకై తే జన్‌జీ యువత దేశ రాజధానిలో పోరాటం చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయించారని, అదే స్ఫూర్తితో రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డీఎస్సీలో చేసిన అక్రమాలపై అదేస్థాయిలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. యువత కోసం వైఎస్సార్‌సీపీ పోరాటానికి సిద్ధంగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పబ్లిసిటీ విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అవినీతిపై సీబీఐ చేత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు కాదు సాక్ష్యాలతో నిరూపిస్తామని సవాలు విసిరారు. లోకేష్‌కు నిజాయితీ ఉంటే రాజీనామా చేసి మా పార్టీకి చెందిన మాజీ మంత్రులతో చర్చలకు రావాలని పిలుపునిచ్చారు.
జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ లోకేష్ నిర్వహించిన దగా డీఎస్సీతో నిరుద్యోగులు మోసపోయారన్నారు. విద్యాశాఖను భ్రష్టు పట్టించారని విమర్శించారు. పేరుకే సీఎంగా చంద్రబాబు అని పెత్తనం మొత్తం లోకేష్ చేతుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు.
జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పల్నాటి రవీంద్రా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.6,500 కోట్లు పేరుకుపోయాయన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిలువునా మోసం చేశారన్నారు. ఈనెల 10వ తేదీ వరకూ ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి అదెన్న, మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, రాష్ట్ర పార్టీ కార్యదర్శి, అద్దంకి నియోజకవర్గ పరిశీలకుడు కర్నేటి ప్రసాద రావు, పార్టీ కార్యదర్శులు బొట్ల రామారావు, కె.వి రమణారెడ్డి, దామరాజు క్రాంతి కుమార్, పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకర్, పోశం మధుసూదన్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


