కనీస వేతనాల కోసం స్కీం వర్కర్ల కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

కనీస వేతనాల కోసం స్కీం వర్కర్ల కన్నెర్ర

Aug 1 2026 2:07 AM | Updated on Aug 1 2026 2:07 AM

భారీగా తరలివచ్చిన అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, వెలుగు, ఆర్‌పీలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు కలెక్టరేట్‌ ఎదుట హోరెత్తిన నిరసన ధర్నా ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం

ఒంగోలు టౌన్‌: రోజుకో ఆందోళనతో ఒంగోలు కలెక్టర్‌ కార్యాలయం వద్ద హోరెత్తుతోంది. ఒకరోజు పొగాకు రైతులు, మరో రోజు కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, తాజాగా అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, స్కీం వర్కర్లు పోరుబాట పట్టడంతో నిత్యం నినాదాలతో మార్మోగుతోంది. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద స్కీం వర్కర్లు మహా ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, వెలుగు వీఏఓలు, ఆర్‌పీలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు భారీగా తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సుమారు మూడు గంటలకు పైగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.

చంద్రబాబు ప్రభుత్వానికి ఇది హెచ్చరిక...

ఎన్నికల హామీలను విస్మరించి మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి ఈ ఉద్యమం ఒక హెచ్చరిక అని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చేది స్కీం వర్కర్లేనని, కానీ వారికి ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పెన్షన్‌, బీమా వంటి కనీస హక్కులు దక్కకుండా చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అంగన్‌వాడీ కార్యకర్తల చేత బండ చాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం వారికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వమని అడుగుతుంటే స్పందించకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. వెలుగు వీఓఏలకు కనీస వేతనంతో పాటుగా రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిరుద్యోగుల మీద రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని, దీన్ని అడ్డుకట్ట వేయకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ స్కీం వర్కర్లు రోడ్డెక్కడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ధర్నాకు అధ్యక్షత వహించిన అంగన్‌వాడీ వర్కర్స్‌, అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్‌ మంజుదార్‌ మాట్లాడుతూ యాప్‌ల పేరుతో స్కీం వర్కర్లపై అదనపు భారం మోపుతున్న ప్రభుత్వం వారిచేత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల మాదిరిగా పనిచేయించాలని చూస్తుందని ఆరోపించారు. దేశంలోనే అత్యల్ప వేతనం ఇస్తూ మధ్యాహ్న భోజన కార్మికుల చేత వెట్టిచాకిరి చేయించడం సిగ్గుచేటన్నారు. అనంతరం ప్రకాశం భవనం నుంచి ర్యాలీగా బయలుదేరి చర్చి సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. మహా ధర్నాలో స్కీం వర్కర్లకు చెందిన వివిధ యూనియన్ల నాయకులు సీహెచ్‌ ఇందిరావతి, పీవిఆర్‌ శ్రీనివాసులు, జాన్‌బాబు, జీ.శేషయ్య, అరుణ, రాజ్యలక్ష్మి, హెమీమా, ధనలక్ష్మి, కోటేశ్వరమ్మ, శేషమ్మ, పి.ఆంజనేయులు, టి.రంగారావు, రాము, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement