పొన్నలూరు: మండలంలోని చెరుకూరు గ్రామంలో ఇల్లు కూల్చిన ఘటనలో నిందితులపై ఎట్టకేలకు కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. కుంచాల నరసింహం ముప్పై ఏళ్ల క్రితం స్థలం కొని, 1993లో పక్కా ఇల్లు నిర్మించుకున్నాడు. ఆయన మరణానంతరం కుమారుడు మాధవరావు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. వారు ఊరిలో లేని సమయంలో ఈ నెల ఇరవైవ తేదీన కుంచాల మాల్యాద్రి పొక్లెయిన్‌తో ఇంటిని పూర్తిగా కూల్చేసి, ఆనవాళ్లు లేకుండా చదును చేశాడు. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, స్థానిక ఎస్సై అసలు ఫిర్యాదు తీసుకోలేదు. బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేసినా, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఎస్సై తిరిగి బాధితుడిపైనే తప్పుడు కేసు నమోదు చేశాడు. పోలీసుల తీరును తప్పుబడుతూ మంగళవారం శ్రీసాక్షిశ్రీలో శ్రీపొన్నలూరు ఎస్సై తలబిరుసు.. బాధితుడిపైనే కేసుశ్రీ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. బుధవారం కొండపి సీఐ రమణయ్య ఆధ్వర్యంలో అధికారులు చెరుకూరు చేరుకుని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులతో పాటు నిందితులను కూడా స్వయంగా విచారించారు. వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాత, ఇల్లు కూల్చివేసిన ప్రధాన నిందితుడు కుంచాల మాల్యాద్రితోపాటు అతనికి సహకరించిన కుటుంబ సభ్యులపై కూడా స్థానిక పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు.
యర్రగొండపాలెం: ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి జూనియర్ అథ్లెట్ల ఎంపిక పోటీలను శనివారం స్థానిక మాచర్ల రోడ్డులోని గిరిజన గురుకుల పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు పి.రామచంద్రరావు, పి.గోపిచంద్‌రెడ్డి గురువారం తెలిపారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ప్రతిభ చూపి ఎంపికై న క్రీడాకారులు తిరుపతిలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో ఉమ్మడి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు. శనివారం ఉదయం 8 గంటలకల్లా క్రీడా మైదానంలో రిపోర్ట్ చేయాలన్నారు. ఇతర వివరాలకు కోచ్ డి.రాజునాయక్ (76750 26220)ను సంప్రదించాలని వారు కోరారు.


