కంభం: రోడ్డు ప్రమాదాల్లో జనం ప్రాణాలు కోల్పోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని హైవే అధికారులపై మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైవే, పోలీస్, ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి గురువారం సాయంత్రం అనంతపురంృఅమరావతి జాతీయ రహదారిపై ఉన్న బ్లాక్‌స్పాట్‌లను ఆమె పరిశీలించారు. కంభం నుంచి బేస్తవారిపేట వెళ్లే మార్గంలోని యూటర్న్, కందులాపురం కూడలిలో ప్రమాదాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. యూటర్న్ వద్ద మార్జిన్ తక్కువగా ఉండటం, రైల్వే ఫ్లైఓవర్ పైనుంచి వాహనాలు వేగంగా వస్తుండటంతో కందులాపురం కూడలి నుంచి వైజంక్షన్ మధ్య తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, గత రెండు నెలల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు, పోలీసులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డీఎస్పీ నాగరాజు కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక, రిఫ్లెక్టివ్ సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పాదచారులు దాటే చోట రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని, రోడ్డు పక్కన పొదలు తొలగించి విజిబిలిటీ మెరుగుపరచాలని, అవసరమైన చోట ఇంజినీరింగ్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్, డీఎస్పీ యు.నాగరాజు, సీఐ మల్లికార్జున, ఇన్‌చార్జి డీటీఓ రాంబాబు, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీనివాసరావు, హైవే అధికారి మల్లికార్జునరెడ్డి, ఎంవీఐలు మాధవరావు, భాస్కరరావు, డీఈ నరసింహులు, తహసీల్దార్ కిరణ్, ఎస్సైలు శివకృష్ణారెడ్డి, రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.
హైవే అధికారులపై కలెక్టర్ విజయ సునీత ఆగ్రహం
అనంతపురం–అమరావతి హైవేపై బ్లాక్‌స్పాట్ల పరిశీలన


