
అన్ని విధాలా అండగా ఉంటాం
● ఎస్పీ ఏఆర్ దామోదర్
ఒంగోలు టౌన్: విధులు నిర్వర్తిస్తూ వివిధ కారణాలతో మృతి చెందిన వారు, రిటైర్డు పోలీస్ సిబ్బంది కుటుంబాలకు, హోంగార్డులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. సమర్ధవంతమైన పోలీసింగ్‌తో పాటు సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తామని, సమాజ రక్షణలో ప్రాణాలర్పించిన సిబ్బందిని పోలీస్ శాఖ ఎప్పటికీ మరచిపోదన్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది కుటుంబాలతో స్వయంగా మాట్లాడి వారికి అందాల్సిన ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ ఫైళ్ల గురించి తెలుసుకొని వాటిని త్వరగా పూర్తి చేసేందుకు సంబంధిత డీపీఓ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కారుణ్య నియామకాలు పొందని కుటుంబసభ్యుల వివరాలు తెలుసుకొని, వారికి త్వరితగతిన కారుణ్య నియామకం పొందేలా కృషి చేస్తామని తెలిపారు. పోలీస్ కుటుంబసభ్యులకు ఏ సమస్య వచ్చినా తనను నేరుగా కలవవచ్చన్నారు. విధులు నిర్వర్తిస్తూ మరణించిన మురళి సతీమణి సుధారాణికి ఇన్సిడెంటల్ చార్జెస్ కింద రూ. 25,000 చెక్కు అందజేశారు. కార్యక్రమంలో సీతారామిరెడ్డి, విజయ్‌కుమార్, డీపీఓ సూపరింటెండెంట్‌లు సంధానిబాష, డి.శైలజ, సిబ్బంది పాల్గొన్నారు.
ఒంగోలు మెట్రో: ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య సంస్థ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయంలో శుక్రవారం వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు 162 జయంతి, తెలుగు భాషా దినోత్సవం నిర్వహించనున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ నూనె అంకమ్మరావు, కుర్రా ప్రసాద్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి జీవీ శివారెడ్డి, నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, నరసం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ, విశిష్ట అతిథులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఉపగ్రంథపాలకురాలు కాళహస్తి సంపూర్ణ, ప్రముఖ కవి నన్నపనేని రవి, మిడసల మల్లికార్జునరావు, గుంటూరు సత్యనారాయణ తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని నిర్వాహకులు తెలిపారు. 10 గంటలకు తెలుగుతల్లి కవుల విగ్రహాలకు పూలాభిషేకం, సాయంత్రం 4 గంటలకు జరిగే తెలుగు భాషా దినోత్సవ సభ అనంతరం ఆహ్వాన కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు భాషాభిమానులు పాల్గొనాలని కోరారు.