
సెంటు స్థలం కోసం ఇంత అరాచకమా స్వామీ?
హైకోర్టులో సివిల్ వివాదంలో ఉన్న స్థలంలోకి పోలీసులను పంపడమేంటి?
చెల్లెలి వరసయ్యే వారితో అన్నలపై లైంగిక దాడి కేసులు పెట్టించడం నీచం
మహిళలను సీఐ బూతులు తిట్టి, లాఠీ చార్జి చేసి, తుపాకీతో బెదిరించడం దారుణం
నెల రోజుల్లో 26 మందిపై అక్రమ కేసులు పెట్టడం అరాచక పాలనకు నిదర్శనం
విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ కొండపి ఇన్‌చార్జి ఆదిమూలపు సురేష్ ధ్వజం
జాళ్లపాలెంలో పోలీసుల దాడిలో గాయపడిన మహిళలు, రైతులకు పరామర్శ
గోడు వెళ్లబోసుకున్న బాధితులు.. అండగా నిలుస్తామని మాజీ మంత్రి భరోసా
కొండపి: కోర్టులో సివిల్ వివాదంలో ఉన్న సెంటు స్థలం స్వాధీనం చేసుకునేందుకు మీకు ఊడిగం చేస్తున్న పోలీసులను ఉసిగొల్పడమే కాకుండా, మహిళలపై లాఠీ చార్జి చేయించి, బండ బూతులు తిట్టిస్తావా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో కలిపి మొత్తం మూడు కేసులు బనాయిస్తావా? నీకు ఇదేం రాక్షసానందం స్వామీశ్రీ అంటూ మంత్రి డీబీవీ స్వామిపై వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొండపి మండలంలోని జాళ్లపాలెం గ్రామంలో గురువారం సాయంత్రం పోలీసుల దాడిలో గాయపడిన వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను ఆయన పరామర్శించారు. పోలీసులు దగ్గరుండి ధ్వంసం చేసిన రచ్చబండ స్థలాన్ని పరిశీలించి అక్కడే విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి సురేష్ మాట్లాడుతూ.. శ్రీజాళ్లపాలెం రెవెన్యూ సర్వే నంబర్ 627లో 20 మందికి చెందిన 50 సెంట్ల స్థలం విషయమై హైకోర్టులో సివిల్ కేసు నడుస్తోంది. అయితే రచ్చ బండ ఉన్న భాగం తనకు చెందిన సెంటు స్థలమని టీడీపీ సానుభూతిపరుడు చెప్పగానే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి స్వామి పోలీసులను గ్రామంపైకి ఉసిగొల్పడం దుర్మార్గమన్నారు. కోర్టు కేసు కారణంగా రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోకపోయినా, సీఐ సోమశేఖర్ అత్యుత్సాహం ప్రదర్శించి ప్రశాంతంగా ఉండే గ్రామంలో అరాచకం సృష్టించడాన్ని తప్పుబట్టారు. జూలై నెలలో ఆరంభమైన స్థల వివాదంలో ఇప్పటివరకు రెండు సాధారణ కేసులు, ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 23 మందిపై వివిధ రకాల కేసులు బనాయించడం అరాచక పాలనకు నిదర్శనమని నిప్పులు చెరిగారు.
మహిళలేమైనా నక్సలైట్లా?
మహిళలపై పోలీసులు, ముఖ్యంగా మర్రిపూడి ఎస్సై రమేష్ బాబు లాఠీ చార్జి చేయడంతోపాటు బూతులు తిట్టడం దారుణమన్నారు. వృద్ధురాలు అనే కనికరం కూడా లేకుండా లాఠీలతో కొట్టి, బూటు కాళ్లతో తన్నడం మంత్రి మెప్పు కోసమేనా అని పోలీసులను నిలదీశారు. శ్రీపచ్చని చెట్టు తొలగించొద్దు, రచ్చబండను ధ్వంసం చేయవద్దు అని కోరిన మహిళలపై తుపాకీ గురిపెట్టి, బూతులు తిడతారా. వీరేమైనా మావోయిస్టులా?శ్రీ అని సీఐ సోమశేఖర్‌ను ప్రశ్నించారు.
అన్నలపై చెల్లితో లైంగికదాడి కేసులు పెట్టిస్తారా?
ఈనెల 26వ తేదీ రాత్రి రచ్చబండ ధ్వంసం, వేపచెట్టు తొలగించిన ఘటనలో టీడీపీ సానుభూతిపరురాలు ఎదురు పుష్పాలుతో అన్నలైన ఎరిగల కోటేశ్వరరెడ్డి, భూమా శ్రీనురెడ్డి, భూమా పుల్లారెడ్డిపై లైంగికదాడికి యత్నించిన కేసు పెట్టించారంటే ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉందా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులు చికిత్స కోసం ఒంగోలు జీజీహెచ్‌కు వెళితే ఓపీ, మందుల చీటీ కూడా ఇవ్వకుండా వేకువజామున 3 గంటల సమయంలో డాక్టర్ ఇంజక్షన్ చేసి వెళ్లిపోవాలని బండి లీలాప్రియను బెదిరించడం, అక్కడి ఎస్సై, ఏఎస్సైలు మీరు పోలీసులపై ఫిర్యాదు చేస్తే మేము ఎలా కేసు నమోదు చేస్తామని చెప్పడం దేనికి సంకేతమన్నారు. ఎవరి స్థలం ఎక్కడుందో తేలకముందే, టీడీపీ సానుభూతిపరుడికి అండగా ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలు, సుమారు 40 మంది పోలీసులు వచ్చి గ్రామంలో దాష్టీకానికి తెగబడటాన్ని ఆక్షేపించారు. తెల్లవారితే వినాయక చవితి పండగ, గ్రామంలో పాము కాటుతో మహిళ చనిపోయి దుఃఖంలో ఉంటే పోలీసులు హింసకు పాల్పడటం హేయమైన చర్య అని అన్నారు.
ఎస్పీ స్వయంగా విచరణ జరపాలి
కొండపి సర్కిల్ పోలీసులు సృష్టించిన ఈ హింసాకాండపై ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వయంగా గ్రామసభ నిర్వహించి విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేసేందుకు డీజీపీ చర్యలు తీసుకోవాలన్నారు. తమ అరాచకాలు ఎక్కడ బయటపడతాయోనని సీసీ కెమెరాను పోలీసులు ధ్వంసం చేశారని, దీనిని బట్టి పోలీసులు ఎంత అరాచకం సృష్టించారో అర్థమవుతుందన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కోటోశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు డాకా పిచ్చిరెడ్డి, సర్పంచ్ భువనగిరి సత్యన్నారాయణ, సీనియర్ నాయకులు మండవ మాలకొండయ్య, వేముల రమేష్, వసంతరావు, వెంకటేశ్వరరెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

సెంటు స్థలం కోసం ఇంత అరాచకమా స్వామీ?