
సంపద దోచేస్తూ..!
అధికార పార్టీ అండదండలతో నల్లమలలో రెచ్చిపోతున్న ముఠాలు జేసీబీలతో యథేచ్ఛగా తవ్వకాలు సైలెన్సర్ బాంబు పెట్టి పేల్చేందుకు యత్నం యర్రగొండపాలెం నియోజకవర్గం చెన్నుపల్లిగూడెం సమీపంలో ఘటన టీడీపీ కీలకనేత అనుచరుడిని అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేయడంతో స్థానికుల ఆగ్రహం ప్రభుత్వ ఉద్యోగుల పాత్రపై అనుమానాలు జేసీబీ, కమాండర్ జీపు స్వాధీనం
చరిత్రను తవ్వేస్తూ..
పశ్చిమ ప్రకాశం.. ఘనమైన చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం. కొత్తపి చాళుక్యులు..విజయనగర రాజులు..
కాకతీయ రాజులు..శాసనంపూడి
వంశస్తులు పాలించిన నేల. పురావస్తుశాఖ అధికారుల పరిశోధనల్లో పలు శాసనాలు కూడా లభ్యమయ్యాయి. ఈ ప్రాంతంలో విలువైన సంపదను కొల్లగొట్టేందుకు అక్రమార్కులు తరచూ తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు.అధికార పార్టీ నేతల అండదండలతో గుప్తనిధుల తవ్వకాల ముఠాల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. గంజివారిపల్లి రేంజ్ పరిధిలోని చెన్నుపల్లిగూడెం సమీపంలో ఏకంగా జేసీబీలతో తవ్వకాలు చేస్తూ సైలెన్సర్ బాంబులు పెట్టి పేల్చుతూ రెచ్చిపోతున్నారు. అటవీ, పోలీస్ శాఖ అధికారులు మొక్కుబడి చర్యలతో సరిపెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిధుల తవ్వకాలలో ప్రభుత్వ ఉద్యోగుల హస్తమున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీకి చెందిన ఒక సర్పంచ్, ఒక ప్రభుత్వ పాఠశాల టీచర్, ఒక వివాదాస్పద గ్రామ కార్యదర్శి పాత్ర ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తవ్వకాలలో సిమెంటు పిల్లర్ కనిపించగానే టీడీపీ కీలక నేతకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అలాగే పశ్చిమ ప్రకాశానికి చెందిన ఒక ఎమ్మెల్యే అనుచరులు కూడా ఈ తవ్వకాలలో ఉన్నారని విశ్వసనీయ సమాచారం. అయితే, అటవీ శాఖ అధికారులు స్వాధీనంలో ఉన్న జేసీబీకి టీడీపీ నేత అనుచరుడు రూ.15 వేలకు డీజిల్ కొట్టించి ఫోన్ పే చేసినట్లు అధికారులకు సాక్ష్యాలు లభించాయని ప్రచారం జరుగుతోంది. ఈ తవ్వకాల్లో అటవీశాఖ ఉద్యోగుల పాత్రపై కూడా అనుమానాలున్నాయి. చెక్‌పోస్టు వద్ద కాపలా కాయాల్సిన ఉద్యోగుల సహకారంతోనే వేటగాళ్లు అడవిలోకి ప్రవేశించినట్లు సమాచారం. లేకపోతే జేసీబీ లాంటి పెద్ద వాహనం వెళ్లగలిగేది కాదని, మూడు రోజులపాటు జేసీబీ, కమాండర్ వాహనాలు లోపలే ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు కూడా సమాధానం లేదు.
నల్లమల అడవిలో ఏర్పాటు చేసిన ఫారెస్టు చెక్‌పోస్టు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పశ్చిమ ప్రకాశంలో మళ్లీ గుప్త నిధుల కోసం జోరుగా తవ్వకాలు జరుగుతున్నాయి. మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి ప్రాంతాల్లో గుప్త నిధుల కోసం తరచూ తవ్వకాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ముఠాలు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలో అయితే ఫారెస్టు చెక్‌పోస్టు ఉన్నప్పటికీ పెద్ద జేసీబీలను సైతం తీసుకెళ్లి తవ్వకాలు చేస్తుండటం గమనార్హం.
విరుడుగుంటలో ఏం జరిగింది...
నల్లమల అటవీ ప్రాంతంలో విస్తరించి ఉన్న యర్రగొండపాలెం మండలంలో 20 కిలోమీటర్లు దాటిన తర్వాత దండకారణ్యం వస్తుంది. గాంధీనగర్ దాటిన తర్వాత అటవీ శాఖ అధికారులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఎవరుపడితే వారు అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా నిత్యం పర్యవేక్షిస్తుంటారు. ప్రతి గురువారం నల్లమల అడవిలోని దద్దనాల ఆంజనేయస్వామికి పూజలు నిర్వహిస్తుంటారు. అక్కడకు వెళ్లే భక్తులను కూడా అటవీ శాఖ అధికారులు నానా ఇబ్బందులు పెడుతుంటారు. తరచూ భక్తులను అడ్డుకుంటుంటారు. అంతటి కట్టుదిట్టమైన రక్షణ ఉన్న అడవిలోకి కొందరు వ్యక్తులు ఏకంగా జేసీబీ తీసుకెళ్లి నిధుల తవ్వకాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఫారెస్టు చెక్‌పోస్టుకు కూతవేటు దూరంలోనే తవ్వకాలు జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంజివారిపల్లి ఫారెస్టు రేంజ్ పరిధిలోని చెన్నుపల్లిగూడెం సమీపంలోని దద్దనాలదాపు సమీపం కోటగట్ల చెరువు పరిసర ప్రాంతాల్లో వీరయ్యస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయ పరిసరాలకు జేసీబీతో పాటుగా కమాండర్ వాహనంలో వెళ్లిన పలువురు వేటగాళ్లు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. పది అడుగుల మేర తవ్వకాలు జరపగా సిమెంటుతో నిర్మించిన పిల్లర్ బయటపడింది. దాన్ని సైలెన్సర్ బాంబులతో పేల్చడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. తవ్వకాలకు ముందు ఆధునిక యంత్రాలతో స్కానింగ్ నిర్వహించినట్లు సమాచారం. మూడు రోజుల పాటు రాత్రివేళల్లో తవ్వకాలు సాగించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
అటవీశాఖ అదుపులో టీడీపీ నాయకుడు.?
మూడు రోజుల తర్వాత గుప్తనిధుల తవ్వకాలు జరుపుతున్న విషయాన్ని పసిగట్టిన అటవీశాఖ అధికారులు తీరిగ్గా రంగప్రవేశం చేశారు. టీడీపీ కీలక నేత ముఖ్య అనుచరుడిని, యర్రగొండపాలేనికి చెందిన జేసీబీ వాహనం యజమానిని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కమాండర్ వాహనానికి సంబంధించిన వ్యక్తులు పరారైనట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. వీరికి అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో ఎలాంటి కేసు నమోదు చేయకుండా తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిగిలిన వారిని సైతం పూర్తిగా విచారించకుండానే పూచీకత్తుపై విడుదల చేశారని తెలుస్తోంది.
గుట్టల చేనులో నిధి దొరికిందా.?
ఆరు నెలల కిందట పాలుట్ల సమీపంలోని గుట్టల చేనులో ఒక వ్యక్తికి నిధి దొరికినట్లు ప్రచారం జరుగుతోంది. స్థానికంగా ఉండే ఒక గిరిజన యువకుడికి బంగారు నాణేలు దొరికినట్టు తెలుస్తోంది. దానిపై యర్రగొండపాలెంలోని ఒక గొర్రెల వ్యాపారికి సమాచారం ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. పోలీసులతో కుమ్మకై ్కన సదరు గొర్రెల వ్యాపారి నమ్మకంగా గిరిజన యువకుడిని పిలిపించి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. అతడితో పాటు మరొకరిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని రెండు రోజుల పాటు విచారించినట్లు తెలిసింది. ఆ తర్వాత అతడి వద్ద ఉన్న బంగారు నాణేలు ఏమయ్యాయో తెలియడంలేదని గుసగుసలాడుకుంటున్నారు.
పాలకుల మొద్దు నిద్ర...
నల్లమల అడవుల్లో తరచూ నిధుల తవ్వకాలు జరుగుతున్నప్పటికీ పాలకులు మొద్దునిద్ర నటిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం కూడా చెన్నుపల్లిగూడెం వద్ద నిధుల కోసం తవ్వకాలు జరిగాయి. అప్పుడు 11 మందిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి మౌనంగా ఉన్న వేటగాళ్లు ఇప్పుడు అధికార పార్టీ అండదండలతో రంగప్రవేశం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. టీడీపీ కీలకనేత అనుచరుడు ఈ ఘటనలో పట్టుబడటం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. నిధుల కోసం విలువైన శాసనాలను, పురాతన దేవాలయాలను ధ్వంసం చేయడం సరికాదని చరిత్రకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిధుల కోసమే తవ్వకాలు
కోటగట్ల చెరువు సమీపంలో నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు నిందితులు అంగీకరించారు. అయితే, వారికి ఎలాంటి నిధి దొరకలేదు. చెక్‌పోస్టులో సిబ్బంది లేని సమయంలో అడవిలోకి ప్రవేశించారు. వారు లోపలకు వెళ్లిన సమాచారం తెలిసిన వెంటనే వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నాం. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం విచారణ జరుపుతున్నాం.
– ప్రసన్న జ్యోతి, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్

సంపద దోచేస్తూ..!