
నల్లమలలో భారీ వర్షం
పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దదోర్నాల మండల పరిధిలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరద నీటితో పలు వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో మండల పరిధిలోని గంటవానిపల్లె గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. తీగలేరు, రాళ్లవాగులు పొంగడంతో గంటవానిపల్లె పూర్తిస్థాయిలో జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామస్తులు బయటకు రాలేక అవస్థపడుతున్నారు. గతంలో గ్రామానికి సంబంధించిన లో లెవల్ కల్వర్టుకు పూర్తి స్థాయిలో మరమ్మతులు నిర్వహించారు. అయితే, గురువారం వరద నీటి ఉధృతికి కల్వర్టుకు నిర్వహించిన మరమ్మతులు పూర్తి స్థాయిలో కొట్టుకుపోయాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీటి ఉధృతి తగ్గిన సమయంలో విద్యుత్ స్తంభాల సహాయంతో వాగు దాటుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై మహేష్ తీగలేరు వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. నల్లమలలో కురిసిన భారీ వర్షాలకు రాళ్లవాగు పొంగి ప్రవహిస్తుండటంతో పెద్దబొమ్మలాపురానికి చెందిన గండి చెరువుకు భారీగా వరద నీరు చేరుతోంది. చెరువు నీటి మట్టం 19 అడుగుల కాగా, ప్రస్తుతం 17 అడుగుల మేరకు నీరు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలుగును మరో రెండు అడుగుల ఎత్తుకు నిర్మిస్తే రైతులకు మేలు జరుగుతుందని కోరుతున్నారు.