
పరిశీలన పూర్తయింది.. ఇక వెళ్లొచ్చు..!
ఒంగోలు సిటీ: డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. నగరంలోని చెరువుకొమ్ముపాలెంలో సరస్వతీ జూనియర్ కాలేజీలో పరిశీలన జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద 568 మంది అభ్యర్థులు వెరిఫికేషన్‌కు వచ్చారు. రాత్రి 9 గంటలకు 400 మందికిపైగా అభ్యర్థుల వెరిఫికేషన్ పూర్తి చేశారు. 12 బృందాలతో వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది. అయితే, సర్టిఫికెట్లు పరిశీలించినట్టు చెక్‌లిస్ట్ కాపీ ఇవ్వమని అడగ్గా ‘మీ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది.. ఇక మీరు వెళ్లవచ్చు’ అని చెబుతున్నారు. దీనిపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మిగతా జిల్లాల్లో ఇస్తున్నారు కదా.. ఇక్కడెందుకు ఇవ్వరని పలువురు అభ్యర్థులు అధికారులను నిలదీశారు. డీఈఓ ఇవ్వొద్దని చెప్పారని వారు సమాధానమివ్వగా, మిగతా జిల్లాల్లో ఇస్తున్న కాపీలను డీఈఓకు అభ్యర్థులు చూపించారు. కొందరు ఆర్జేడీకి ఫోన్ చేశారు. అయితే, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలు అమలు చేస్తున్నామని ఆయన సమాధానమివ్వగా, మిగతా జిల్లాల్లో ఇస్తుండగా.. ఇక్కడ అభ్యంతరం ఏమిటని అడగడంతో ఆర్జేడీ ఫోన్ కట్ చేశారని పలువురు అభ్యర్థులు తెలిపారు. రాష్ట్రమంతా ఒక రూలు.. ఇక్కడ మరో రూలా అంటూ వారు మండిపడుతున్నారు. కనీసం మెగా డీఎస్సీ లాగిన్‌లో అయినా సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయినట్లు మెసేజ్ వస్తే బాగుంటుందని అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.