
బషీర్‌బాగ్ స్ఫూర్తితో మరో విద్యుత్ పోరాటం
ఒంగోలు టౌన్: బషీర్‌బాగ్ అమరవీరుల స్పూర్తితో రాష్ట్రంలో మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. విద్యుత్ సంస్కరణలను ఉపసంహరించుకోకుంటే ప్రజాగ్రహంలో కూటమి ప్రభుత్వం కొట్టుకొని పోవడం ఖాయమని చెప్పారు. ప్రతిజ్ఞా దినాన్ని పురస్కరించుకొని 25 ఏళ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో అమరులైన రామకృష్ణ, విష్ణువర్దన్ రెడ్డి, బాలస్వామికి గురువారం ప్రకాశం భవన్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ.. 2000 సంవత్సరంలో విద్యుత్ ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు జరిపించిందని, వేలాది మంది కార్యకర్తలు బుల్లెట్లకు ఎదురు నిలిచి పోరాటం చేశారని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో చంద్రబాబు, లోకేష్ స్మార్ట్ మీటర్లను పగులగొట్టాలని పిలుపునిచ్చి, గద్దెనెక్కిన తర్వాత స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని, ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజల మీద మోయలేని భారం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్కరణలపై కమ్యూనిస్టులు ఇప్పటికే ఉద్యమబాట పట్టారని, మరో పోరాటంతో చంద్రబాబు ప్రభుత్వం శంకరగిరి మాన్యాలు పట్టడం ఖాయమన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు డి.రమాదేవి, సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి డీవీఎన్ స్వామి, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు, రైతు నాయకులు చుండూరి రంగారావు, వామపక్ష నాయకులు ఆర్.మోహన్, కె.రమాదేవి, లలితకుమారి, బి.పద్మ, ఎల్.రాజశేఖర్, కొండారెడ్డి, బాలకోటయ్య, శ్రీరాం శ్రీనివాస్, ఎంఏసాలార్, ప్రకాశ్ రావు తదితరులు పాల్గొన్నారు.