
విష సంస్కృతిని పెంచి పోషించొద్దు
గిద్దలూరు రూరల్(బేస్తవారిపేట): గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులను టార్గెట్ చేసి అక్రమ కేసులు పెట్టి అరాచక పాలన చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేపీ నాగార్జునరెడ్డి మండిపడ్డారు. గురువారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు దొడ్డంపల్లి పంచాయతీలో జరిగిన గొడవలో దెబ్బలు తిన్నవారు వైద్యశాలలో ఉండి కేసు పెడితే బెయిలబుల్ సెక్షన్లు, ఎటువంటి దెబ్బలు లేనివారు కేసు పెడితే నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం దారుణమన్నారు. గ్రామాల్లో వివాదాలు జరిగేటప్పుడు సర్దిచెప్పేందుకు వెళ్లిన పెద్దమనుసులపై కేసులు పెట్టిన ఘనత గిద్దలూరు పోలీసులకే దక్కిందన్నారు. 45 ఏళ్లుగా రాజకీయాలు చేస్తూ అందరికీ అనుకూలంగా ఉండే బొర్రా కృష్ణారెడ్డిని ఏ2గా చేర్చి రిమాండ్‌కు పంపడం దుర్మార్గమన్నారు. సహాయం చేయడానికి, సర్దిచెప్పడానికి గ్రామాల్లో పెద్దమనుషులు ఉండకూడదనే సంప్రదాయానికి నాందిపలకడం సమంజసం కాదన్నారు. గ్రామాల్లో ఇంలాటి విష సంస్కృతిని పెంచిపోషించకుండా ఎస్పీ, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్ సీపీ శ్రేణులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, వైఎస్సార్‌సీపీ నగర పార్టీ అధ్యక్షులు మానం బాలిరెడ్డి, గిద్దలూరు, రాచర్ల మండల అధ్యక్షులు బి.ఓబులరావు, యేలం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ శ్రేణులపై అక్రమ కేసుల నమోదు తగదు
గొడవ వద్దని సర్ది చెప్పిన నాయకుడిపై కేసు పెట్టడం దారుణం
వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి కేపీ నాగార్జునరెడ్డి