
అధిక ధరలపై కన్నెర్రజేసీ
కొత్తపట్నం:
యూరియాను అధిక ధరలకు విక్రయించడంపై జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ కన్నెర్ర చేశారు. దుకాణదారునిపై 6ఏ కేసు నమోదు చేసి యూరియా నిల్వలను సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే..కొత్తపట్నం మండలంలో ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఒంగోలు సహాయ వ్యవసాయ సంచాలకుడు బి.రమేష్‌బాబు, తహసీల్దార్ శాంతి, వ్యవసాయాధికారి జి.కిషోర్‌బాబు బృందంతో దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత కొత్తపట్నం శివాలయం వీధిలో ఉన్న షా ఎంటర్‌ప్రైజెస్ ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. తనిఖీల్లో యూరియా రూ.266లకు విక్రయించాల్సి ఉండగా అధిక ధరకు రూ.300 విక్రయిస్తుండటంతో జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణదారునిపై 6ఏ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దుకాణంలోని 108 యూరియా బస్తాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎరువుల బస్తాలు ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు ఫిర్యాదు చేస్తే దుకాణ యజమానులపై చట్టపర చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు ధరలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.