
ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోండి
● జాతీయ రహదారిపై ట్రాక్టర్ అడ్డుపెట్టి చిన్నగుడిపాడు గ్రామస్తుల రాస్తారోకో
పెద్దదోర్నాల:
కర్నూల్, గుంటూరు జాతీయ రహదారిపై తరచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని చిన్నగుడిపాడు వాసులు మంగళవారం వాహనాల రాకపోకలను అడ్డుకుని రాస్తారోకోకు దిగారు. దీంతో కర్నూల్, గుంటూరు జాతీయ రహదారిపై గంట పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిధిలోని చిన్నగుడిపాడులో సోమవారం రాత్రి ఓ వాహనం ఢీకొని బొమ్మలాపురానికి చెందిన వ్యకి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రహదారిలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో స్పీడ్ బ్రేకర్లతో పాటు డివైడర్లు ఏర్పాటు చేసి ప్రమాద తీవ్రతను తగ్గించాలని కోరుతూ గ్రామస్తులు రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న ఎస్సై మహేష్ హుటాహుటిన చిన్న గుడిపాడుకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారితో చర్చించారు. సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాహనాల రాకపోకలను అడ్డుకోవడం సరైన చర్య కాదన్నారు. సమస్య ఉన్నప్పుడు తహశీల్దార్ దృష్టికో, లేదంటే ఉన్నతాధికారుల దృష్టికో తీసుకు రావాలన్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, ఆందోళన విరమించాలని కోరడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. దీంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాల రాకపోకలను పోలీసులు క్రమబద్ధీకరించారు.