
పోలీసులను అడ్డుపెట్టుకుని దారుణాలు
ఎస్సై, సీఐ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి వైఎస్సార్ సీపీ నాయకులపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలి తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
దర్శి: నియోజకవర్గంలో పోలీసులను అడ్డుపెట్టుకుని దారుణాలు చేస్తున్నారని, పోలీసులు శాంతి భద్రతలు పక్కన పెట్టి వైఎస్సార్‌సీపీ నాయకుల పై కేసులు పెట్టడం, దాడులు చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ముండ్లమూరు మండలం పసుపుగల్లులో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చింతా శ్రీనివాసరెడ్డికి చెందిన దుకాణాలను కూల్చేసిన విషయం తెలుసుకున్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అక్కడకు వెళ్లి పరిశీలించారు. అక్కడ మహిళలు తమతో పోలీసులు ప్రవర్తించిన తీరును పూస గుచ్చినట్లు వివరించారు. పోలీసులు తమపై అమానుషంగా ప్రవర్తించారని, చెప్పలేని అసభ్య పదజాలంతో బూతులు తిట్టి దారుణంగా వ్యవహరించారని వాపోయారు. సంస్కారం మరచి తమతో అసభ్యంగా ప్రవర్తించిన తీరును వివరించారు. అనంతరం దర్శి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నాయకులతో కలసి బూచేపల్లి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని అన్నారు. తెల్లవారుజామునే దర్శి సీఐ రామారావు, ఎస్సై మురళి, ముండ్లమూరు ఎస్సై కమలాకర్, తాళ్లూరు ఎస్సై మల్లిఖార్జున్, మరో 30 మంది పోలీసులు వచ్చి దౌర్జన్యంగా శ్రీనివాసరెడ్డి స్థలంలో ఉన్న గదులను పడగొట్టడంపై మండిపడ్డారు. పంచాయతీరాజ్‌కు సంబంధం లేని సెక్రటరీ ఇచ్చిన కంప్లైంట్ అడ్డం పెట్టుకుని కక్ష సాధింపుగా దుకాణాలు పడగొట్టారన్నారు. ఆర్‌అండ్‌బీ పరిధిలో ఆ స్థలం లేదని, చింతలపూడి వెళ్లే రోడ్డు పక్కన కాలువల వెనక్కు గదులు ఉన్నాయని, అయినా ఏ అధికారంతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పడగొట్టారని బూచేపల్లి ప్రశ్నించారు. ఇటీవల తూర్పువీరాయ పాలెం గ్రామంలో ముప్పరాజు శ్రీనివాసరావు భవనాన్ని పొక్లెయిన్‌లతో కూల్చి వేశారన్నారు. ఈరోజు చింతా శ్రీనివాసరెడ్డి దుకాణాలు పడగొట్టారన్నారు. అక్కడున్న మహిళలను, మండల ప్రజా ప్రతినిధిని ఈడ్చుకెళ్లి అసభ్య పదజాలంతో నానారకాల ఇబ్బందులు పెట్టారన్నారు. సంబంధం ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ ఫిర్యాదు చేయలేదని, సంబంధం లేని సెక్రటరీ ఫిర్యాదు చేస్తే దౌర్జన్యంగా ఎందుకు పగలగొట్టాల్సి వచ్చిందని పోలీసులను నిలదీశారు. ‘‘టీడీపీ ఇన్‌చార్జ్ గారు.. మీరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు... మీకు చేతనైతే పది మందికి సాయం చేయండి. అధికారం ఉంది కదా అని పోలీస్ వ్యవస్థను వాడుకుని ఇలా చేయడం మంచి పద్ధతి కాదని’’ హితవు పలికారు. పోలీసులు శాంతి భద్రతలు పక్కన పెట్టి వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు పెట్టడం, దాడులు చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. పోలీసులు అరాచకాలు, దౌర్జన్యాలు, కక్షసాధింపులు మానుకోవాలన్నారు. మండల కన్వీనర్‌ను లాగి చొక్కా చించి దారుణంగా ప్రవర్తించారన్నారు. ఈ విషయాలను ఎస్పీ, డీజీపీల దృష్టికి తీసుకుని వెళ్లి ఇక్కడ పోలీస్‌ల తీరుపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
బడ్జెట్ తగ్గించుకోవాలనే పింఛన్‌లు పీకేశారు:
జిల్లాలో బడ్జెట్ తగ్గించుకోవాలనే 3780 పింఛన్‌లు తీసేశారని, నియోజకవర్గంలో 579 పింఛన్‌లు తీసేశారని చెప్పారు. ఏళ్ల తరబడి పింఛన్‌లు తీసుకుంటున్న వారిని కూడా అనర్హులుగా చేశారని, వారి ఉసురు ప్రభుత్వానికి తగులుతుందన్నారు. వైఎస్సార్ సీపీ మద్దతుదారులను టార్గెట్ చేసి పింఛన్‌లు రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరికీ వెంటనే పింఛన్‌లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ నాయకుడిలా సీఐ దౌర్జన్యం:
ముండ్లమూరు మండల కన్వీనర్ చింతా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 2002లో భూమిని కొనుగోలు చేసి అప్పటి నుంచి అందులో రూములు వేసుకుని ఉన్నామన్నారు. సీఐ తామేమి చెప్పినా వినకుండా టీడీపీ నాయకుడిలా దౌర్జన్యం చేశారన్నారు. మీరు జీతాలు తీసుకుంటుంది ప్రభుత్వం దగ్గరా లేక టీడీపీ కార్యాలయంలోనా లేక ఇన్‌చార్జ్ దగ్గర తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. ‘‘మీ టైం అయిపోయింది వెళ్లిపోండిరా’’ అంటూ దౌర్జన్యంగా మాట్లాడిన తీరు తమను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పది మందికి సాయం చేస్తే ఎవరైనా హర్షిస్తారు కానీ ఇలా కక్ష సాధింపు చర్యలు చేస్తే ప్రజాగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హితవు పలికారు. విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మండల కన్వీనర్‌లు వెన్నపూస వెంకటరెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, యన్నాబత్తిన సుబ్బయ్య, జెడ్పీటీసీలు నుసుం నాగిరెడ్డి, తాతపూడి రత్నరాజు, స్టేట్ మహిళా విభాగం కార్యదర్శి మేడికొండ జయంతి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోలీసులను అడ్డుపెట్టుకుని దారుణాలు