
ముగిసిన ఒంగోలు పుస్తక మహోత్సవం
ఒంగోలు సిటీ: పది రోజుల పాటు పుస్తక ప్రియులను అలరించిన మూడో ఒంగోలు పుస్తక మహోత్సవం ఆదివారం ఘనంగా ముగిసింది. చివరి రోజు కావడంతో పాఠకులు ఉదయం 10 గంటల నుంచే పీవీఆర్ బాలుర పాఠశాల మైదానానికి పోటెత్తారు. రాత్రి 9 గంటల వరకు పుస్తకాల కొనుగోలు కొనసాగింది. వచ్చే ఏడాది ఒంగోలుకు మళ్లీ వస్తామని నిర్వాహకులు ఇచ్చిన హామీతో పుస్తక మహోత్సవానికి వీడ్కోలు పలికారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు నిర్వహించిన క్విజ్ పోటీలో మొత్తం 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీకి చెందిన రహ్మానుద్దీన్ నిర్వహించారు. క్విజ్ పోటీలో మూడు జట్లు బహుమతులు సాధించాయి. పది రోజుల పాటు జరిగిన పుస్తక మహోత్సవంలో కథలు చెప్పడం, చిత్రలేఖనం, దేశభక్తి గీతాలాపన, ఏకపాత్రాభినయం, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన మొత్తం 60 మంది విద్యార్థులకు ముఖ్య అతిథి పెనుగొండ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. దివంగత బి.హనుమారెడ్డి జీవితం–సాహిత్యం అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. కార్యక్రమానికి అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాశ్, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు కె.లక్ష్మయ్య తదితరులు వక్తలుగా పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. మూడో ఒంగోలు పుస్తక మహోత్సవం ముగింపు సభ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ సభకు జనవిజ్ఞాన వేదిక సీనియర్ నాయకుడు పుల్లారావు అధ్యక్షత వహించారు. ముగింపు ప్రసంగాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక అధ్యక్షుడు వల్లూరు శివప్రసాద్ అందించారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదికకు చెందిన జయప్రకాశ్, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు కె.లక్ష్మయ్య, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ తరఫున సాహిత్య కార్యక్రమాల నిర్వాహకులు రహ్మానుద్దీన్ పాల్గొన్నారు. ముగింపు సభలో లక్ష్మయ్య మాట్లాడుతూ ఒంగోలు పుస్తక మహోత్సవం ఒంగోలుకు చెందిన సాహితీవేత్తలు తమంతట తాముగా నిర్వహించదలిస్తే అందుకు పూర్తి సహకారం విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అందిస్తుందని ఆయన అన్నారు.