
ఆంధ్రకేసరి త్యాగాలు మరువలేనివి
ఒంగోలు సబర్బన్: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని మనందరం రాష్ట్రాభివృద్ధికి కృషి చేద్దామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతిని పురస్కరించుకుని శనివారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణతో కలిసి పూలమాలలు వేసి మంత్రి నివాళులర్పించారు. టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనుమడు సంతోష్‌కుమార్‌ను శాలువాతో సన్మానించారు. ఏబీఎం కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ పింగళి పాండురంగారావు రచించిన జాతీయ స్థాయి ధీరుడు టంగుటూరి ప్రకాశం పుస్తకాన్ని మంత్రి డోలా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, డీఆర్‌ఓ చిన ఓబులేసు, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డీటీసీ సుశీల, డీసీఓ పద్మశ్రీ, డీఆర్‌డీఏ పీడీ నారాయణ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఒంగోలు అర్బన్ తహసీల్దార్ పిన్నిక మధుసూదన్‌రావు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
ఆంధ్రకేసరి జీవితం స్ఫూర్తిదాయకం...
ఒంగోలు టౌన్: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో శనివారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర, పీసీఆర్ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఆర్‌ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి పాల్గొన్నారు.