
సభ్యసమాజం తలదించుకునేలా ఎమ్మెల్యే ‘బుడ్డా’ తీరు
అధికారులపై అధికార గర్వాన్ని ప్రదర్శించాడు పుణ్యక్షేత్రంలో మద్యం తాగి వీరంగం సృష్టించడం హేయమైన చర్య ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అటవీ శాఖ అధికారులపై వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం రాత్రి శ్రీశైలంలో అటవీ శాఖాధికారులపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, తన అనుచరులు దాడి చేసిన సంఘటనపై ఆయన స్పందించారు. ఈ మేరకు గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన సాక్షితో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి నేతలకు అధికార మదం తలకెక్కి మనుషులమేనన్న విచక్షణ కోల్పోయి ఏకంగా అధికారులపై జులుం ప్రదర్శిస్తున్న తీరు అందరూ గమనిస్తున్నారన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రానికి అతిసమీపంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా అర్ధరాత్రి సృష్టించిన వీరంగం రాష్ట్రంలో అధికారులపై ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపు, లెక్కలేనితనాన్ని సూచిస్తుందన్నారు. ఆ ఎమ్మెల్యే రాష్ట్రంలో సీబీఎన్ అమ్ముతున్న కల్తీ మద్యం సేవించినట్లుందని, తాను ఒక ఎమ్మెల్యే అని మరచి తనకున్న అధికార గర్వాన్ని ప్రదర్శించాడని మండిపడ్డారు. దళితుడైన ఎఫ్‌బీవో టీకే గురవయ్యను వాహనంలో ఎక్కించుకొని ఆయన ఛాతిపై తన అనుచరులతో దాడి చేయిస్తూ రాత్రంతా రోడ్లపై తిప్పాడని, ఈ సంఘటన సభ్య సమాజం ఛీత్కరించుకునేలా ఉందన్నారు. ఇంత జరిగినా ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు చీమకుట్టినట్లు లేక పోవడం శోచనీయమని, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.