
ప్రకృతి విధ్వంసకులు చరిత్రహీనులే
ఒంగోలు టౌన్: ప్రకృతిని కాపాడిన వారే ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారని, ప్రకృతిని విధ్వంసం చేసిన వాళ్లు చరిత్ర హీనులుగా మిగులుతారని ప్రజా రచయిత జయరాజ్ అన్నారు. నగరంలోని పీవీఆర్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరుగుతున్న పుస్తక మహోత్సవం బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కళారంగం సమాజంపై ప్రభావం అనే అంశంపై జరిగిన చర్చలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రకృతి మానవుడికి సమస్తం ఇచ్చిందని చెప్పారు. విమానాలు, రాకెట్లను ప్రకృతి నుంచే స్ఫూర్తి పొంది తయారు చేశారని, మానవుడు సొంతంగా కనుగొన్నదేమీ లేదన్నారు. మనిషి అవసరాలను తీరుస్తుంది ప్రకృతేనని స్పష్టం చేశారు. ప్రకృతిని గాఢంగా ప్రేమించిన అంబేడ్కర్ దేశం గర్వించదగిన మేధావిగా పేరొందారన్నారు. ప్రకృతి సంపద సమస్త మానవులందరికీ సమానంగా చెందాలన్న కారల్ మార్క్స్ యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశారని, చెరువులు తవ్వించి, చెట్లు నాటిన అశోకుడు చరిత్రలో గొప్ప రాజుగా నిలిచిపోయాడని వివరించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...ప్రపంచ విప్లవాలలో ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది ప్రజా కళలేనని చెప్పారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి చిన్నం పెంచలయ్య, చంద్రనాయక్, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి మనోహర్ నాయుడు, గాయకులు రామకృష్ణ, నూకతోటి శరత్‌బాబు పాల్గొన్నారు. తొలుత జయరాజ్ రచించిన గేయాలను ఆలపించడం ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. పుస్తక మహోత్సవానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ప్రజా రచయిత జయరాజ్