
రవాణా కార్మికులను చిన్నచూపు చూస్తున్నారు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు ఆగ్రహం 24న ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపు
ఒంగోలు టౌన్: రవాణా రంగం కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని, బీఎన్‌ఎస్ చట్టంతో కార్మికుల జీవితాలను సంక్షోభంలో పడేశాయని ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటేపల్లి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టం, బీఎన్‌ఎస్ చట్టాలను తీసుకొచ్చి కార్మికులను కోలుకోని దెబ్బతీసిందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై జిల్లాలో ఉద్యమం జరుగుతోందని తెలిపారు. పోలీసులు, ఆర్టీఓల వేధింపులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఒంగోలులో ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. నగరంలోని ఆటో కార్మికులకు పర్మినెంట్ స్టాండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక కాపు కళ్యాణ మండపంలో మహాసభలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఫెడరేషన్ ఆలిండియా ప్రధాన కార్యదర్శి జనాబ్‌దేవ్, జాతీయ ఉపాధ్యక్షుడు ఆర్.లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.శివాజీ, ముజఫర్ అహ్మద్, కె.దుర్గారావు తదితరులు పాల్గొంటారని తెలిపారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గంపై అణచివేత కొనసాగుతోందని చెప్పారు. కార్మిక కోడ్లతో ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని చెప్పారు. దేశంలో రవాణా రంగం చాలా కీలకమైనదని, రవాణా రంగం ఆగిపోతే దేశం స్తంభిస్తుందని చెప్పారు. కార్మిక హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలు చేపడతామన్నారు. సమావేశంలో కార్మిక సంఘ నాయకులు తంబి శ్రీనివాసరావు, దాసరి మల్లికార్జునరావు, మున్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు.