
పిల్లలకు ఉడికీ, ఉడకని భోజనం
ఒంగోలు వన్‌టౌన్: ఉడికీ, ఉడకని అన్నం పిల్లలకు పెడుతున్నారని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒంగోలులోని మంగమూరు రోడ్డులో ఉన్న బీసీ బాలుర వసతి గృహాన్ని ఆయన సోమవారం రాత్రి పరిశీలించారు. వసతి గృహంలో ప్రతి గదిని పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ స్వయంగా పిల్లలకు వడ్డించే భోజనం తిని సరిగ్గా ఉడక్కపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తన సొంత డబ్బులతో పిల్లలకు భోజనం తెప్పించారు. వసతి గృహం పై రెండు సెల్‌ఫోన్ టవర్లను ఏర్పాటు చేశారని, దీని వలన పిల్లలపై రేడియేషన్ ప్రభావం పడుతుందన్నారు. మంచినీటిని పిల్లలే బయట నుంచి తెచ్చుకుంటున్నారన్నారు. ప్రతి గదిలో చిన్న లైటు ఒకటి మాత్రమే ఉందని, తాము పరిశీలిస్తున్న సమయంలోనే ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. మొదటి అంతస్తు ఫ్లోర్ విద్యార్థులు నడిస్తే ఊగిపోతుందని విద్యార్థులు తెలపడంతో పరిశీలించారు. వర్షం పడితే విద్యార్థులు కనీసం విశ్రమించడానికి కూడా వీలు లేకుండా గది మొత్తం వర్షం నీటితో ఉండిపోయే పరిస్థితి ఉందన్నారు. 99 మంది విద్యార్థులకు 6 బాత్రూంలు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రతి నెలా విద్యార్థులకు చెల్లించాల్సిన కాస్మొటిక్ చార్జీలను కూటమి ప్రభుత్వం గత డిసెంబర్ నుంచి విద్యార్థుల ఖాతాలకు జమ చేయడంలేదన్నారు. విద్యార్థులను ప్రతి వారం వైద్యులు చెకప్ చేయాలని అలా జరగడంలేదని, పైగా హాస్టల్‌లో గడువు తీరిన మందులు ఉన్నాయని, వీటినే విద్యార్థులకు అందిస్తున్నారని చెప్పారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొన్నుగంటి చైతన్య, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జోనల్ ఇన్‌చార్జి దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి, ప్రకాశం జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రరెడ్డి, సంయుక్త కార్యధర్శి ప్రవీణ్ చంద్, విక్రమ్, వేణు, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
మంత్రి సవాల్‌ను స్వీకరిస్తాం
రాష్ట్రంలో ఏహాస్టల్ బాగోలేదో చెప్పాలన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సవాల్‌ను తాము స్వీకరిస్తామని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్నారు. ఒంగోలు మంగమూరు రోడ్డులోని బీసీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి రాష్ట్రంలోని ఏ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లోని పరిస్థితులను పరిశీలించలేదన్నారు. నారా వారి స్పెషల్ బొద్దింక భోజనాన్ని వసతి గృహంలో విద్యార్థులకు అందించారని, దీనికి సాక్ష్యం హోం మంత్రేనన్నారు. జగనన్న గోరుముద్దలను ఘోర ముద్దలుగా కూటమి ప్రభుత్వం మార్చిందన్నారు. జగనన్న రూ.7245 కోట్లు ఖర్చు పెట్టి విద్యార్థులకు పోషకాహారం అందించారని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పీ చైతన్య మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్స్ సంక్షోభ హాస్టల్స్‌గా మారాయన్నారు. డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సినిమా టిక్కెట్లు పెంచమని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు కానీ విద్యార్థుల కాస్మొటిక్ చార్జీలను పెంచడంలేదన్నారు. జిల్లాకు చెందిన మంత్రి బాలవీరాంజనేయ స్వామి రూ.149 కోట్లు హాస్టళ్ల మరమ్మతులకు విడుదల చేసినట్లు ప్రకటించినా ఎక్కడా మరమ్మతులు జరగలేదన్నారు. విద్యార్థులకు ఇంత వరకూ బెడ్ షీట్లు అందించలేదని చెప్పారు.
అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్