
అత్యవసర షెడ్యూల్‌లో ఆంతర్యం ఏమిటి ?
● కొండపి పంచాయతీ ఎన్నికలపై మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్
కొండపి: కొండపి పంచాయతీ ఎన్నికలకు అత్యవసర షెడ్యూల్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ మంత్రి సురేష్ ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం కొండపిలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొండపి పంచాయతీ నాయకులతో ఎన్నికల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సురేష్ మాట్లాడుతూ 2026 ఫిబ్రవరి నాటికి అన్ని పంచాయతీలకు గడువు ముగుస్తుందని కేవలం 6 నెలల మాత్రమే ఉన్న సందర్భంలో ఇప్పటికిప్పుడు కొండపి పంచాయతీకి షెడ్యూల్ ప్రకటించడంలో దాగి ఉన్న మర్మం ఏంటి అని ప్రశ్నించారు. కోర్టు కేసుల పెండింగ్ నుంచి రాష్ట్రంలో దాదాపు 27 పంచాయతీలు ఉన్నాయని, అందులో జిల్లాలో మంగమూరు పంచాయతీ కూడా ఉందని, కేవలం రెండు పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని మంత్రి స్వామి ఒత్తిడి చేసి ఎన్నికల నిర్వహిస్తున్నారన్నారు. ఓటర్ల జాబితా అంతా తప్పులు తడకగా ఉందని, దానితో ఎలక్షన్ కు ఎలా వెళతారని ప్రశ్నించారు. వార్డుల్లో ఓట్లను ఏ ప్రాతిపదికన నిర్ణయించారో ఎవరికీ అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారన్నారు. రానున్న ఆరు నెలల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పంచాయతీ ఎన్నికలతో పాటు కొండపి పంచాయతీకి కూడా ఎన్నిక నిర్వహిస్తే అంతా సవ్యంగా ఉండేదన్నారు. నామినేషన్లకు కేవలం మూడు రోజుల మాత్రమే అవకాశం ఇచ్చారని, పోటీ చేసే అభ్యర్థులు ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉందన్నారు. కేవలం మంత్రి స్వామి స్వలాభాపేక్ష కోసం మాత్రమే ఎన్నికల నిర్వహిస్తున్నారని పంచాయతీలోని ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. పంచాయతీలో పోటీ చేయడానికి ఒక కమిటీని వేశామని, కమిటీ ఆదేశాల మేరకు అభ్యర్థుల పోటీ పై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ బచ్చల కోటేశ్వరరావు, గొట్టిపాటి మురళి, బొక్కిసం సుబ్బారావు, ఆరికట్ల కోటిలింగయ్య, వైస్ ఎంపీపీ రావులపల్లి కోటరాజు, యామవరపు వీర వసంతరావు, సుల్తాన్ వన్నూరు, హరి నారాయణ శేఖర్ రెడ్డి, రాయుడు, శివరాం, కొర్నేలు, వెంకటరావు, శ్రీను చిన్న వసంతరావు, వెంకటేశ్వర రెడ్డి, రమణారెడ్డి నజీర్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.