
డబ్బులకు పీడించకు అన్నందుకు..
గిద్దలూరు రూరల్: అధికార టీడీపీ అండదండలతో గిద్దలూరులో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి వేధింపులకు గురిచేయడం సరికాదన్నందుకు కర్రలతో దాడి చేసి రెచ్చిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసే ఆస్పత్రి నుంచి రిపోర్టు వచ్చిన తర్వాత చూస్తామంటూ సమాధానమిస్తున్నారని బాధితుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గిద్దలూరు మండలం దిగువమెట్టకు చెందిన ఆవుల నరసమ్మ, ఆమె చెల్లెలు లక్ష్మీదేవి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక వడ్డీలకు, చీటీపాటల ద్వారా డబ్బులు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే మహిళ నరసమ్మ వద్ద చీటీ పాడుకుంది. నెలకు రూ.5 వేలు చొప్పున ఆరు నెలల వాయిదాలు చెల్లించాల్సి ఉంది. ఆ డబ్బుల కోసం సోమవారం నరసమ్మ తన మనుషులతో కలసి వెంకటమ్మ ఇంటికి వచ్చింది. దుర్భాషలాడుతూ డబ్బులు చెల్లించాలని నిలదీసింది. ఆ సమయంలో వెంకటమ్మ సమీప బంధువు సుధాకర్ అధిక వడ్డీలు తీసుకోవడం పద్ధతి కాదని, డబ్బులకు మనుషులను ఈ విధంగా పీడించడం ఏమిటని ప్రశ్నించాడు. మధ్యలో నీకెందుకు అంటూ నరసమ్మ మనుషులు సుధాకర్, అతని భార్య శివాణి పై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో సుధాకర్ తలకు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం గాయపడిన వారిని బంధువులు చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం సుధాకర్‌ను నంద్యాల వైద్యశాలకు తరలించారు. బాధితులు ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎనిమిది మంది వ్యక్తులు వచ్చి తమ వారిపై దాడికి పాల్పడ్డారని పోలీసులకు చెప్పారు. వైద్యశాల నుంచి రిపోర్టు వచ్చిన తరువాత కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు సమాధానమిచ్చారు.
దీనిపై బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలు చూసుకుని డబ్బుల కోసం దాడికి పాల్పడుతున్నారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి ప్రజలను పీడించే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కర్రలతో ఇష్టారాజ్యంగా దాడి తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలు గిద్దలూరులో వడ్డీ వ్యాపారుల దాష్టీకం అధికార టీడీపీ అండదండలతో దాడులు మెడికల్ రిపోర్టు వచ్చాక కేసు నమోదు అంటున్న పోలీసులు