రిజర్వేషన్లు మాయం! | - | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లు మాయం!

Jul 30 2025 7:04 AM | Updated on Jul 30 2025 7:04 AM

రిజర్వేషన్లు మాయం!

రిజర్వేషన్లు మాయం!

జిల్లాలో మార్కెట్‌ యార్డు కమిటీ చైర్మన్ల నియామకంలో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించింది. ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన పదవులను అగ్రకులాలకు అప్పగించి స్వయంగా ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్న కూటమి ప్రజాప్రతినిధులకు ఉన్నతాధికారులు సైతం జీ హుజూర్‌ అనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు దక్కాల్సిన పదవులను వేరేవారికి కట్టబెట్టడంపై అధికార పార్టీలోని ఎస్సీ, ఎస్టీ నాయకులు రగిలిపోతున్నారు. దళితుల హక్కులను కాలరాస్తున్నారని జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలు మండిపడుతున్నారు. న్యాయం కోసం ఇప్పటికే కొందరు కోర్టు తలుపులు తట్టారు. మరికొందరు అదే దారిలో ఉన్నారు.
అగ్రతాంబూలం..

సాక్షి ప్రతినిధి,ఒంగోలు: జిల్లాలో 10 మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. యార్డు చైర్మన్‌ పదవుల నియామకం విషయంలో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లను ఖరారు చేసింది. బీసీ వెల్ఫేర్‌ డిపార్టమెంట్‌ ద్వారా జీవో నంబర్‌ ఎంఎస్‌ 77ను విడుదల చేసింది. దీని ప్రకారమే రిజర్వేషన్లు నిర్ణయించాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం తొలుత కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలననుసరించి జనాభా ప్రతిపాదిక, రొటేషన్‌ విధానం ద్వారా జూన్‌ 6వ తేదీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని కనిగిరి దర్శి మార్కెట్‌ యార్డులను ఎస్సీలకు రిజర్వ్‌ చేశారు. యర్రగొండపాలెం మార్కెట్‌ యార్డు పదవిని ఎస్టీలకు కేటాయించారు. ఒంగోలు, గిద్దలూరు బీసీ జనరల్‌కు, పొదిలి బీసీ మైనార్టీ మహిళకు కేటాయించారు. మొత్తం మీద ఓసీలకు 4, బీసీలకు 3, ఎస్సీలకు 2, ఎస్టీకి 1 రిజర్వ్‌ చేశారు. ఇక్కడ దాకా సజావుగా సాగినట్లు కనిపించింది. ఆ తర్వాత తాను ఇచ్చిన ఆదేశాలనే పక్కన పెట్టేసింది రాష్ట్ర ప్రభుత్వం. రిజర్వేషన్లు గిజర్వేషన్లు లేవు, అంతా మా ఇష్టం అన్నట్టుగా కూటమి పాలకులు సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు.

దళితులు, ఆదివాసీల సీట్లపై కన్ను...

జిల్లాలోని 10 మార్కెట్‌ యార్డుల్లో 4 చోట్ల ఓసీలకు కేటాయించినా టీడీపీ నాయకులు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్‌ చేసిన స్థానాలపై కన్నేశారు. ఇక్కడ కూడా తామే పెత్తనం చేయాలన్న దురుద్దేశంతో రిజర్వేషన్లను పక్కన పెట్టేశారు. అధికారం చేతిలో ఉండడంతో దొడ్డిదారిన వారి పదవులను అనుభవించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో దళితులకు రిజర్వ్‌ అయిన కనిగిరి, దర్శి మార్కెట్‌ యార్డు పదవులను చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కలెక్టర్‌ రిజర్వేషన్లను ప్రకటించినా టీడీపీ ఎమ్మెల్యేలు లెక్కచేయడం లేదు. ఆయా స్థానాల్లో ఓసీల అభ్యర్థులను ప్రకటించి నిబంధనలకు వ్యతిరేకంగా వారి చేత ప్రమాణ స్వీకారాలు చేయిస్తున్నారు. కూటమి పాలకుల బరితెగింపు చూసి ఎస్సీ, ఎస్టీ సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎస్సీకి రిజర్వ్‌ చేసిన కనిగిరి మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పదవికి అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన ఏరువ శ్రీనివాసరావుకు ప్రకటించారు. ఇప్పుడాయన స్థానంలో ఆయన సతీమణి రమాదేవికి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే లిస్టును హైకమాండ్‌ వద్దకు పంపించినట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ టీడీపీలోని ఎస్సీలు నిరాశకు గురవుతున్నారు. తమ నోటికాడికి వచ్చిన అవకాశాన్ని లాగేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే దర్శి మార్కెట్‌ యార్డులోనూ ఇదే తంతు కొనసాగుతోంది. ఎస్సీలకు రిజర్వ్‌ చేసిన ఈ స్థానంలో తొలుత బీసీ మహిళకు కట్టబెడుతూ ఈ నెల 10వ తేదీన ప్రభుత్వం జీవో ఆర్‌టీ నంబర్‌ 585 విడుదల చేసింది. నియోజకవర్గ ఇన్‌చార్జీ ఒత్తిడితో మరుసటి రోజే ఈ ఉత్తర్వును రద్దు చేసింది. 11వ తేదీన ఓసీ మహిళకు రిజర్వ్‌ చేస్తూ మరో ఉత్తర్వును జారీ చేసింది. నిజానికి కలెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దర్శి మార్కెట్‌ యార్డు ఎస్సీలకు కేటాయించాల్సి ఉంది. కలెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టి తమ ఇష్టం వచ్చినట్లు రిజర్వేషన్లను మార్చుకుంటున్న కూటమి పాలకుల తీరు మీద తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొదిలి మార్కెట్‌ యార్డు పదవిని బీసీ మైనారిటీ మహిళకు కేటాయించగా అక్కడ మైనార్టీ పురుషుడిని నియమించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఎస్టీలకు రిజర్వ్‌ చేసిన యర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకుడికి మార్కెట్‌ యార్డు పదవిని కట్టబెట్టేందుకు కూటమి నేతలు పన్నాగాలు పన్నుతున్నారు.

రూ.2 కోట్లకు మార్కెట్‌ యార్డు పదవి...

మార్కెట్‌ యార్డు పదవులకు జిల్లాలో భారీగా డిమాండ్‌ ఏర్పడింది. ఈ పదవి కోసం టీడీపీలోని ఓసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎంతకై నా రెడీ అంటున్నట్టు సమాచారం. పశ్చిమ ప్రకాశం జిల్లాలోని

ఒక కీలక నియోజకవర్గంలో రూ.2 కోట్లకు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పదవిని అమ్ముకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న మరో నియోజకవర్గంలో కూడా ఈ పదవికి మంచి ధర పలికినట్లు చెప్పుకుంటున్నారు. తెరవెనుక పెద్ద ఎత్తున లాలూచీలు జరగడంతోనే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్‌ చేసిన పదవులను వారికి దక్కకుండా చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో గందరగోళంగా మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ పదవుల కేటాయింపులు పది స్థానాల్లో 4 జనరల్‌, 3 బీసీలకు, 2 ఎస్సీలకు, 1 ఎస్టీకి రిజర్వేషన్లకు తిలోదకాలిచ్చిన కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో ఓసీలకు పదవులు మహిళకు రిజర్వ్‌ చేసిన పొదిలి మార్కెట్‌ యార్డు చైర్మన్‌ కుర్చీలో పురుషుడికి పట్టం కనిగిరి, దర్శిలు ఎస్సీలకు కేటాయిస్తే..ఓసీల నియామకం అంతా మాఇష్టం అంటున్న టీడీపీ నాయకులు పశ్చిమాన చైర్మన్‌గిరికి రూ.2 కోట్ల ముడుపులు రగలిపోతున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు

మార్కెట్‌ యార్డు పదవుల భర్తీలో జిల్లా వ్యాప్తంగా రిజర్వేషన్లను అమలు చేయకుండా మొండిగా వ్యవహరిస్తున్న కూటమి పాలకులకు యర్రగొండపాలెంలో ఎదురు దెబ్బ తగిలింది. కూటమిలోని బీజేపీకి చెందిన ఎస్సీ నాయకులు, ఆలిండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగుల సంఘం మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆరె రమణయ్య ఎస్టీలకు కేటాయించిన యర్రగొండపాలెం మార్కెట్‌ యార్డును ఓసీలకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఎస్టీ జనరల్‌ రిజర్వేషన్‌ను అమలు చేయకుండా ఓసీ అభ్యర్థికి మార్కెట్‌ యార్డు పదవిని కట్టబెడుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు జీవో ఆర్‌టీ నంబర్‌ 593ను సవాల్‌ చేస్తూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో జీవోను సస్పెండ్‌ చేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. తదుపరి ఆగస్టు 4వ తేదీన వాదనలు వింటామని, అప్పటి వరకు సదరు ఓసీ అభ్యర్థి పదవి చేపట్టకూడదని, యార్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని ఆదేశించింది. ఇదే విషయం మీద ఒక గిరిజన నాయకుడు కూడా కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఇదే విధంగా జిల్లాలోని కనిగిరి, దర్శి, పొదిలి మార్కెట్‌ యార్డుల విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ పలువురు ఎస్సీ సంఘాల నాయకులు హైకోర్టు తలుపు తట్టనున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement