
అజెండాపై నిరసనలు..
ఒంగోలు సబర్బన్: నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం అజెండా విషయంలో కార్పొరేటర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ట్రంకు రోడ్డు విస్తరణలో నష్టపోతున్న వారికి పరిహారం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఒంగోలు నగర మేయర్ జి.సుజాత అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం మంగళవారం కార్యాలయ ప్రాంగణంలోని కౌన్సిల్ హాలులో నిర్వహించారు. అమృత్–2 పథకంలో మంచినీటి సరఫరా మెరుగుపరిచేందుకు, సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నెలకొల్పటానికి, బత్తులవారికుంట అభివృద్ధితో పాటు ఇతర పనులకు కలిపి రూ.484.55 కోట్ల కేటాయింపు విషయమై జనసేన కార్పొరేటర్ ఈదర చిన్నారి ప్రస్తావిస్తూ రూ.9 కోట్లు నగర పాలక సంస్థ మీద భారం వేయటం సబబుకాదన్నారు. అదేవిధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కౌన్సిల్ ఆమోదం రూ.339.93 కోట్లు అయితే మరో రూ.100 కోట్లు ఎందుకు పెరిగిందో వివరించాలని మేయర్‌ను అడగగానే టీడీపీ సభ్యుడు తిప్పరపల్లి రవితేజ లేచి అడ్డుకోవటంతో సభలో కొంతసేపు వాదోపవాదాలు జరిగాయి. మంచినీటి సరఫరాకు సంబంధించి ఒకే అంశాన్ని మూడు, నాలుగు చోట్ల ఎందుకు పెట్టారని ఈదర సురేష్ ప్రశ్నించారు. అదేవిధంగా ఎన్‌టీఆర్ కళాక్షేత్రంలో గతంలో మున్సిపాలిటీకి డబ్బులు ఎగ్గొట్టిన వ్యక్తికే తిరిగి అప్పజెప్పటాన్ని జనసేన కార్పొరేటర్ యనమల నాగరాజు ప్రస్తావించారు. వాటి రికార్డులు కూడా కార్యాలయంలో లేవన్నారు.
ట్రంకు రోడ్డు విస్తరణలో వ్యాపారులకు నష్ట పరిహారం ఇవ్వాలి: వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు
నగర అభివృద్ధిలో భాగంగా ట్రంకు రోడ్డు, మస్తాన్ దర్గా నుంచి బీవీఎస్ హాలు మీదుగా కొత్తపట్నం బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ చేస్తున్న సందర్భంగా వ్యాపారులకు నగదు రూపంలో నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. విస్తరణతో నగరంలోని చిన్న, పెద్ద వ్యాపారులు తమ దుకాణాలను కోల్పోయి నిరాశ్రయులు అయ్యే అవకాశం ఉందన్నారు. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వమే విస్తరణ చేపట్టిందని, అప్పట్లో వ్యాపారులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. వాళ్లను అన్ని రకాలుగా ఆదుకోవాలని, పూర్తిగా దుకాణాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా మున్సిపల్ స్థలాలు వ్యాపార కూడళ్లలో కేటాయించాలన్నారు. వైఎస్సార్ సీపీ మరో సభ్యుడు జి.ప్రవీణ్ కుమార్ కూడా వ్యాపారులను ఆదుకోవాలని గొంతు కలిపారు. అదేవిధంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో డివిజన్లలో పర్యటించినప్పుడు స్థానికులు చెప్పిన అభివృద్ధి పనులను గడప గడపకు మన ప్రభుత్వం (జీజీఎంపీ) పథకంలో చేపడితే వాటిని రద్దు చేయాలని టీడీపీ సభ్యులు చెప్పటం దారుణమని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. అప్పట్లో చేసిన సనులకు బిల్లులు చెల్లించకపోతే ఆ కాంట్రాక్టరు ఏం కావాలని నిలదీశారు. ఈ విషయమై డిప్యూటీ మేయర్, జనసేన నేత వెలనాటి మాధవరావు కూడా ఏకీభవించారు. కేటాయించిన పనులు ఆపటం సరికాదన్నారు. ప్రస్తుతం సాధారణ నిధులు ఖర్చు చేస్తున్నారని గతంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు రూ.కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. వాళ్లకు చెల్లించకుండా కొత్త పనులు ఏవిధంగా చేపడతారని ప్రశ్నించారు. అదేవిధంగా బీపీఎస్ పథకం కింద రూ.10 కోట్లు రావాల్సి ఉందని, వాటితో పాటు ఇతర ఆదాయ వనరుల కింద మున్సిపాలిటీకి రావాల్సినవి ఉన్నాయని, వాటిని రాబట్టడంలో అధికారులు వైఫల్యం చెందారన్నారు.
నగరంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాన మంత్రి పీవీ.నరసింహారావు, మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విగ్రహాలను తొలగించవద్దంటూ వైఎస్సార్‌సీపీ, జనసేన కార్పొరేటర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. కూరగాయల మార్కెట్‌లో షాధీఖానాకు ఎదురుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని స్థానిక కార్పొరేటర్ ప్రస్తావించారు. నగరంలో పారిశుధ్యం దారుణంగా ఉందని కార్పొరేటర్ ఈదర సురేష్ బాబు ప్రస్తావించారు. కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్.విజయ కుమార్, కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంఈ ఏసయ్య, ఏసీపీ సుధాకర్, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వాడీవేడీగా ఒంగోలు నగరపాలక సంస్థ సమావేశం ట్రంకు రోడ్డు విస్తరణలో వ్యాపారులకు నష్టపరిహారం ఇవ్వాలన్న వైఎస్సార్ సీపీ పూర్తిగా షాపులు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పథకంలో అభివృద్ధి పనుల రద్దుపై సభలో రచ్చ పీవీ, కొణిజేటి విగ్రహాలను యధాతథంగా ఉంచాలన్న వైఎస్సార్ సీపీ, జనసేన సభ్యులు టీడీపీ, జనసేన సభ్యుల మధ్య మాటల యుద్ధం

అజెండాపై నిరసనలు..