
31న జిల్లా స్థాయి అథ్లెట్ల ఎంపిక
యర్రగొండపాలెం: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అడహక్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గిరిజన గురుకుల పాఠశాలలో అథ్లెట్లను ఎంపిక చేయనున్నట్లు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పి.రామచంద్రరావు, ఎం.వెంకటరెడ్డి మంగళవారం తెలిపారు. ఈ ఎంపికలో అండర్ 14, 16 విద్యార్థినీ, విద్యార్థులు, 18, 20 ఏళ్ల వయస్సు ఉన్న యువతీ, యువకులు పాల్గొనవచ్చన్నారు. ఎంపికై న అథ్లెట్స్‌ను బాపట్ల జిల్లా చీరాలలో జరిగే 36వ రాష్ట్ర స్థాయి జూనియర్ సౌత్‌జోన్ అథ్లెటిక్స్ మీట్‌కు ఎంపిక చేస్తామని వారు తెలిపారు. ఆసక్తి ఉన్న అథ్లెట్స్ తమ జనన ధ్రువీకరణ పత్రం, 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో ఈ నెల 31వ తేదీ ఉదయం 8 గంటలలోపు హాజరు కావాలన్నారు. పూర్తి సమాచారం కోసం రాజు నాయక్, బ్రహ్మనాయక్ సెల్ నంబర్లు, 76750 26220, 99081 69358లకు సంప్రదించవచ్చని చెప్పారు.
అనుబంధ సంఘాల ఏర్పాటుపై సమీక్ష
చీమకుర్తి: ప్రకాశం, బాపట్ల జిల్లాల వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘాల ఇన్‌చార్జి మెట్టు వెంకట అప్పారెడ్డి మంగళవారం చీమకుర్తిలో ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రకాశం జిల్లా లో అనుబంధ సంఘాల కమిటీలను ఏర్పాటు చేసేందుకు త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు.
ఎస్సీ కాలనీలో పాఠశాలను కొనసాగించాలి
● కలెక్టర్‌కు విన్నవించిన ఖాజీపురం ఎస్సీ కాలనీవాసులు
కంభం: ఎస్సీకాలనీలో 40 ఏళ్లుగా ఉన్న పాఠశాలను తొలగించి మరోస్కూల్‌లో కలిపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని బేస్తవారిపేట మండలం ఖాజీపురం ఎస్సీ కాలనీకి చెందిన పలువురు మహిళలు కలెక్టర్ తమీమ్ అన్సారియాకు ఫిర్యాదు చేశారు. మంగళవారం కంభంకు వచ్చిన కలెక్టర్‌ను వారు కలిసి తమ సమస్యను విన్నవించారు. గ్రామంలో ఉండే మెయిన్ స్కూల్‌లో విద్యార్థులు తక్కువగా ఉన్నారని, తమ స్కూల్‌లో 26 మంది పిల్లలున్నారని, కానీ ఇక్కడ ఉన్న పిల్లలను మెయిన్ స్కూల్‌లో చేర్పించి ఈ పాఠశాలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. నెల రోజుల నుంచి మండల అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రధానోపాధ్యాయుడిని అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదని ఫిర్యాదు చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న స్కూల్‌ను యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.
తల్లికి వందనం డబ్బులు పడలేదమ్మా... !
తన ఇద్దరు పిల్లలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారని వారికి తల్లికి వందనం డబ్బులు పడలేదని బత్తుల వెంకటజ్యోతి అనే మహిళ మంగళవారం కంభం పర్యటనకు వచ్చిన కలెక్టర్ తమీమ్ అన్సారియా ముందు వాపోయింది. తర్లుపాడు మండలానికి చెందిన బత్తుల వెంకట జ్యోతి ఇద్దరు కవల పిల్లలు రాములు, లక్ష్మణ్ కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. వారికి తల్లికి వందనం డబ్బులు పడలేదని పాఠశాలలో అడిగితే గ్రీవెన్స్ లో పెట్టుకుంటే పడతాయని చెప్పడంతో గ్రీవెన్స్‌లో అర్జీ పెట్టింది. ఆ తర్వాత కూడా డబ్బులు పడకపోవడంతో అక్కడికెళ్లి అడగ్గా స్కూల్‌లోనే వెళ్లి అడగండి అని చెబుతున్నారని ఆమె కలెక్టర్ దృష్టికి తెచ్చింది. అక్కడే ఉన్న ఎంఈఓను, ఎంపీడీఓను పిలిచిన కలెక్టర్ వారు ఏ సచివాలయం కిందకు వస్తారో.. ఎందుకు డబ్బులు పడలేదో వెంటనే విచారించండని ఆదేశించారు.

31న జిల్లా స్థాయి అథ్లెట్ల ఎంపిక

31న జిల్లా స్థాయి అథ్లెట్ల ఎంపిక