
వివాహిత అనుమానాస్పద మృతి
దర్శి: పట్టణంలోని లంకోజనపల్లి రోడ్డుకు చెందిన రావులపల్లి ఐశ్వర్య(21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సోమవారం సాయంత్రం 9 గంటల ప్రాంతంలో లంకోజనపల్లి రోడ్డులోని తమ నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. మృతురాలు కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు..బొట్లపాలెం గ్రామానికి చెందిన మాడపాకుల అంజయ్య కుమార్తె ఐశ్వర్యను ఏడాదిన్నర క్రితం రావులపల్లి వంశీకి ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం తమ కుమార్తెను వేధించేవాడని తెలిపారు. ఇటీవల వేధింపులు ఎక్కువ కావడంతో సోమవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఎస్సై మురళీని వివరణ కోరగా..భర్త వేధిపులు కారణంగా భార్య ఉరేసుకోని ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
హెచ్‌ఈఓ మృతి
బేస్తవారిపేట: రోడ్డు ప్రమాదంలో మోక్షగుండం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్‌ఈఓగా పనిచేస్తున్న శగునాల నాగేశ్వరరావు(57) మంగళవారం మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని మోక్షగుండం సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేరోడ్డుపై జరిగింది. వివరాల్లోకి వెళఇతే..హజరత్‌గూడెం నుంచి స్కూటీపై నాగేశ్వరరావు పీహెచ్‌సీ బయలుదేరాడు. మోక్షగుండం సమీపంలో వైద్యశాలలోనికి వెళ్లేందుకు హైవేరోడ్డు క్రాస్ చేసే సమయంలో బ్రహ్మంగారిమఠం నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని 108లో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించే సమయంలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కంది విత్తనాలు కొందరికే..!
కొనకనమిట్ల: కంది విత్తనాల పంపిణీ తీరుపై కొనకనమిట్లలో రైతులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రైతు సేవా కేంద్రంలో మంగళవారం కంది విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు ఏఈఓ, వీఏఏలు చెప్పడంతో ఆశగా వెళ్లిన రైతులకు భంగపాటు ఎదురైంది. ఉచితంగా కంది విత్తనాలు ఇస్తున్నట్లు చెప్పడంతో పెద్ద సంఖ్యలో రైతులు తమ భూముల జిరాక్స్ కాపీలతో వెళ్లారు. మధ్యాహ్నం వరకు 40 మంది రైతులకు ఒక్కొక్కరికి 4 కిలోల చొప్పున విత్తనాలు పంపిణీ చేసిన అధికారులు సర్వర్ పని చేయడం లేదని, మరో 40 మందికే విత్తనాలు ఇస్తామని స్పష్టం చేయడంతో రైతులు ఆగ్రహించారు. తమ పరిస్థితి ఏమిటని వీఏఏని నిలదీయడంతో ‘మేమేం చేయలేం. ప్రభుత్వం 80 ప్యాకెట్లు ఇచ్చింది. అవే పంచుతున్నామ’ని జవాబిచ్చారు. దీనిపై ఏఓ ప్రకాష్‌రావును వివరణ కోరగా మండలానికి 70 క్వింటాళ్ల కంది విత్తనాలు వచ్చాయని, సాగు చేసే రైతులే తీసుకోవాలని చెప్పారు.

వివాహిత అనుమానాస్పద మృతి

వివాహిత అనుమానాస్పద మృతి