
ఫిషింగ్ హార్బర్ స్థల పరిశీలన
కొత్తపట్నం: ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ గురువారం పరిశీలించారు. కొత్తపట్నం మండలంలోని కె.పల్లెపాలెం గ్రామంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017–18లో హార్బర్ మంజూరైందని, స్థలం కేటాయింపులో సమస్యలతో నిలిచిపోయిందని అన్నారు. సుమారు రూ.400 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రంగం సంసిద్ధమైందని తెలిపారు. గ్రామ పెద్దల సమక్షంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫిషింగ్ హార్బర్‌తో కలిగే లాభాలు, అవసరాల గురించి వివరించారు. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటైతే పెద్ద పడవలు వస్తాయని, వాటి ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని, అలాగే మత్స్యకారుల స్థితిగతులు మారతాయని తెలిపారు. సబ్సిడీ ద్వారా కూడా పెద్ద పడవలు అందించే అవకాశం ఉందన్నారు. ఫిషింగ్ హార్బర్ కావాలంటే స్థలం కావాలని, దానికి అందరి సహకారం అవసరమని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి సోనా బోట్లు వచ్చి తమ సంపదను కొల్లగొడుతున్నాయని మత్స్యకారులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందించారు. డ్రోన్ కెమెరాలతో వాటిని గుర్తించి కఠిన చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలోని మత్స్యకారులు సుమారు 350 పడవలతో జీవనం కొనసాగిస్తుండగా, మత్స్య సంపద ఎలా వస్తుందని కమిషనర్ ఆరా తీశారు. మరో వారంలో పూర్తిగా ఫిషింగ్ హార్బర్ స్థలం ఏర్పాటు గురించి సంబంధిత అధికారులతో చర్చించి స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఎండీ నగేష్, జాయింట్ డైరెక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు, ఏడీ ఇన్‌చార్జి ఎస్.శ్రీనివాసరావు, భాస్కర్, ఎఫ్‌డీవో ఆషా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వరకుమార్, సర్వేయర్ సుధీర్‌బాబు, మత్స్యశాఖ యూనియన్ అధ్యక్షుడు పేరయ్య, శ్రీను, జక్రయ్య, ఎంపీటీసీ సభ్యుడు నరసింహారావు, గ్రామ పెద్దలు, మత్స్యకారులు పాల్గొన్నారు.