
చెరువులు, కాలువల అభివృద్ధి ప్రతిపాదనలు వెనక్కి...
జిల్లాలోని సాగునీటి చెరువులు, కాలువల అభివృద్ధికి జిల్లా జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం కనీసం కనికరం కూడా లేకుండా వెనక్కి తిప్పిపంపింది. జిల్లా వ్యాప్తంగా 153 పనులను గుర్తించిన అధికారులు అందుకోసం సుమారు రూ.13.20 కోట్లు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. వాటిని పట్టించుకోకుండా వెనక్కు తిప్పి పంపటంతో అధికారులు చేసేది లేక మిన్నకుండిపోయారు. అందులో ప్రధానంగా కొండపి అసెంబ్లీ నియోజకవర్గంలోని పాలేరు–బిట్రగుంట సప్లై చానల్ కింద 11 అభివృద్ద్ధి పనులకు రూ.1.47 కోట్లు కేటాయించాలని పంపిన ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొండపి నియోజకవర్గంలోని సంగమేశ్వరం ప్రాజెక్టుకు టీడీపీ పాలకులు మంగళం పాడి కనీసం ఉపయోగం లేకుండా చేశారు. కనీసం ఈ నిధులు వస్తే పీబీ చానల్ కింద చెరువులు బాగుపడతాయని, దానికింద ఉన్న 9 చెరువుల పరిధిలోని 9,500 ఎకరాలకుపైగా పంట పొలాలు సస్యశ్యామలం అవుతాయని రైతులు కూడా భావించారు.