నైరాశ్యమే! | - | Sakshi
Sakshi News home page

నైరాశ్యమే!

Aug 2 2025 10:20 AM | Updated on Aug 2 2025 10:20 AM

నైరాశ

నైరాశ్యమే!

నమ్మినోళ్లకు
ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చని చంద్రబాబు
● గద్దెనెక్కిన 14 నెలల తర్వాత తొలిసారి దర్శి మండలంలో పర్యటన ● బాబు హామీలను గుర్తు చేసుకుంటున్న నియోజకవర్గ ప్రజలు ● గత ఏడాది ఆయకట్టుకు సాగు నీరందక ఎండిన పంటలు ● నష్ట పరిహారం కింద అన్నదాతలకు పైసా విదల్చని సర్కారు ● దొనకొండకు రాని పరిశ్రమలు.. నిరుద్యోగుల ఉసూరు

‘నేను మారాను.. మీకంతా మంచే చేస్తాను. దొనకొండలో పరిశ్రమలు స్థాపిస్తా.. నిరుద్యోగులకు ఉద్యోగాలొచ్చే వరకు భృతి అందజేస్తా.. ఎంఎస్‌ఎంఈ ప్రాజెక్టును పునరుద్ధరిస్తా.. హైవే బ్రిడ్జిలు నిర్మిస్తా.. సాగర్‌ ఆయకట్టులో మూడు పంటలు పండించుకునేలా సాగునీరు సరఫరా చేస్తా.. తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ఇంటింటికీ తాగునీరు అందిస్తా..’ ఇవీ గత ఏడాది సార్వత్రిక ఎన్నికల వేళ దర్శి నియోజకవర్గ ప్రజలకు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ఇచ్చిన హామీలు. ఇవి కాకుండా కూటమి మేనిఫెస్టోలో సూపర్‌ సిక్స్‌తోపాటు మొత్తం 140కి పైగా హామీలు గుప్పించి ఇంటింటికీ కరపత్రాలు పంపిన చంద్రబాబు.. తీరా గద్దెనెక్కిన తర్వాత అమలు సంగతి మరిచారు. హామీలు అమలు చేస్తారని చంద్రబాబును నమ్మిన ప్రజలకు చివరకు మిగిలింది నైరాశ్యమే. అధికారం చేపట్టిన తర్వాత సీఎం హోదాలో తొలిసారి దర్శి పర్యటనకు వస్తున్న చంద్రబాబునాయుడు హామీలపై పెదవి విప్పుతారో.. ఎప్పటిలాగే నాలుక మడతేస్తారోనని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దర్శి: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 2024 మే 4వ తేదీన దర్శి పర్యటనకు వచ్చిన చంద్రబాబు ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించారు. కానీ వాటిలో ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేసిన దాఖలాలు లేవు. దొనకొండలో ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటు చేస్తామని, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, తద్వారా నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని నమ్మబలికిన చంద్రబాబు ఇక్కడ ఒక్క పరిశ్రమనూ నెలకొల్పే దశగా చర్యలు తీసుకోలేదు. పైగా నిరుద్యోగులకు రూ.3 వేల చొప్పున ఇస్తామన్న భృతినీ తొలి ఏడాదే ఎగ్గొట్టారు. 2014–19 మధ్య ఐదేళ్లపాటు పాడిన పాటనే చంద్రబాబు గత ఏడాది సార్వత్రిక ఎన్నికల మరళా పాడారు. కానీ అభివృద్ధికి అన్ని వనరులు ఉన్న దొనకొండను మాత్రం పట్టించుకోలేదు.

రైతులకు దగా

గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేసి సాగర్‌ కాలువల ద్వారా మూడు పంటలకు నీరు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆయకట్టు పరిదిలో కనీసం ఒక పంటకు కూడా గతేడాది నీరు అందించలేదు. శనివారం చంద్రబాబు పర్యటిస్తున్న తూర్పు వీరాయపాలెం గ్రామంలోని పొలాలకు సైతం పూర్తి స్థాయిలో ఒక పంటకు కూడా నీరివ్వలేదు. గతేడాది సాగర్‌ ఆయకట్టు పరిధిలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో నీరు అందక మొక్కజొన్న పంట ఎండిపోయింది. అలాగే అకాల వర్షాల కారణంగా వరి, సజ్జ, గుమ్మడి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఆయా పంటలను మంత్రులు, కలెక్టర్‌ పరిశీలించి వెళ్లారే కానీ పంట నష్టపోయిన రైతులకు పైసా విదిల్చిన పాపాన పోలేదు.

పరిశ్రమలు హుళక్కేనా?

రాగముక్కపల్లిలో రూ.7 కోట్ల నిధులతో ఎంఎస్‌ఎంఈ ప్రాజెక్ట్‌ పునఃప్రారంభిస్తామని, చందవరం వద్ద రూ.6 కోట్లతో ఓవర్‌ బ్రిడ్జి నిర్మిస్తామన్న హామీలు నెరవేర్చే దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. కేంద్రంలో కూటమి పార్టీనే అధికారంలో ఉన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులే కానీ ఈ ఏడాది కిలోమీటర్‌ ట్రాక్‌ కూడా నిర్మించలేదు. దర్శి నుంచి శ్రీకాళహస్తి వరకు పనులన్నీ ఆగిపోయాయి. పెద్ద ఉయ్యాలవాడలో ముసి నదిపై వంతెన, దోర్నపు వాగుపై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం సంగతినే మరిచారు.

● గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనులు ప్రారంభమైన ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ స్కూల్‌ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పనులను పరుగెత్తిస్తామని, అభివృద్ధికి తొలి అడుగు అక్కడ నుంచేనని టీడీపీ ఇన్‌చార్జ్‌ గొట్టిపాటి లక్ష్మి ఇచ్చిన హామీకి ఇంత వరకు అతీగతి లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అధికారులను పిలిపించి డ్రైవింగ్‌ స్కూల్‌ పనులపై చర్చించడం మినహా గడిచిన 13 నెలలుగా అటువైపు కన్నెత్తి చూడలేదు. గత ప్రభుత్వంలో చేపట్టిన నిర్మాణాలు, భవనాలకు వేసిన పిల్లర్లు అలాగే దర్శనమిస్తున్నాయి.

తాగునీటికీ దిక్కులేదు

దర్శి నియోజకవర్గంలో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేస్తామన్న హామీ నీటి మూటగా మారింది. ప్రస్తుతం ఎన్‌ఏపీ రిజర్వాయర్‌ నుంచి తాగునీరు శుద్ధి చేయకుండా నేరుగా పైప్‌లైన్ల ద్వారా వదులుతున్నారు. అవి తాగిన ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఆ నీటిని కూడా వారం, పది రోజులకు ఒకసారి వదులడం గమనార్హం. కొన్ని గ్రామాలకు 15 రోజులకు కూడా నీరు సరఫరా కావడం లేదు. గత ప్రభుత్వంలో అమృత్‌ 2.0 పథకంలో భాగంగా దర్శి నగర పంచాయతీకి రూ.121 కోట్లతో నూతన పైప్‌లైన్లు, ఇంటింటికీ తాగునీటి కుళాయిలు మంజూరు చేశారు. ఆ పనులను జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ ప్రారంభించారు. అయితే కూటమి అధికారంలోకి రాగానే అమృత్‌ పనులను నిలిపివేశారు. గుండ్లకమ్మ ఎగువ నీటిని తాళ్లూరు మండలం మల్కాపురం వద్ద లిఫ్ట్‌ చేసుకుని మండ్లమూరు, తాళ్లూరు మండలాలకు తాగునీరు ఇస్తామన్న హామీని ఇంతవరకు పట్టించుకోలేదు. తాళ్లూరు మండలంలోని మొగిలిగుండాల రిజర్వాయర్‌ పనులు పరుగులు పెట్టిస్తానని ప్రజలకు ఇచ్చిన హామీని సైతం గాలికొదిలేశారు.

అక్రమాలపై ఆరాతీస్తారా?

దర్శి నియోజకవర్గంలో అభివృద్ధిని గాలికొదిలేసి కూటమి నేతలు యథేచ్ఛగా దందాలు చేస్తున్నారు. ముండ్లమూరు మండలం చిలకలేరులో ఇసుకను జేసీబీలతో తవ్వి టన్ను రూ.1230కు తెగనమ్మారు. టర్బో లారీల్లో ఇతర ప్రాంతాలకు సైతం ఇసుక తరలించి సొమ్ము చేసుకున్నారు. భవన నిర్మాణదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని దర్శి గడియారం స్తంభం సెంటర్‌ సాక్షిగా హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇక్కడ జరుగుతున్న ఇసుక దందాపై స్పందిస్తారా అనేది ప్రశ్నార్థకమే. గ్రామాలు, పట్టణాల్లో విచ్చలవిడిగా వెలసిన బెల్టు షాపులు, సమయ పాలన లేకుండా బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు, అడ్డగోలుగా గ్రావెల్‌ తవ్వకాలపై చంద్రబాబు ఆరా తీస్తారా లేదా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

నైరాశ్యమే!1
1/4

నైరాశ్యమే!

నైరాశ్యమే!2
2/4

నైరాశ్యమే!

నైరాశ్యమే!3
3/4

నైరాశ్యమే!

నైరాశ్యమే!4
4/4

నైరాశ్యమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement