
ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
● క్షయ వ్యాధిగ్రస్తులతో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వాణిశ్రీ
ఒంగోలు టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నిక్షమ్ పోషణ యోజన కింద క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం కోసం ప్రతి నెలా రూ.1000 బ్యాంకులో జమ చేస్తోందని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వాణిశ్రీ తెలిపారు. దాంతోపాటుగా దాతల సహాయంతో కూడా పోషకాహారాన్ని అందజేస్తున్నట్లు చెప్పారు. వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక కోడేవీధిలోని మస్జిద్‌లో టీబీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాపాకాలనీ అర్బన్ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రంగకుమార్ యాదవ్ మాట్లాడుతూ రెండు వారాల కంటే ఎక్కువగా జ్వరం రావడం, విడవకుండా దగ్గు వేధించడం, చాతిలో నొప్పి, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని చెప్పారు. మద్యపానం, ధూమపానం చేసే వ్యక్తులు, మధుమేహంతో బాధపడేవారు, పోషకాహార లోపం కలిగిన వారు ఎక్కువగా క్షయవ్యాధి బారినపడే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని క్షయవ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీపీఎం కోటేశ్వరరావు, టీబీ సూపర్‌వైజర్ కాలేషా తదితరులు పాల్గొన్నారు.