
పట్టపగలు దొంగల హల్‌చల్
● సుమారు 10 సవర్ల బంగారం చోరీ
సింగరాయకొండ: పట్టపగలే ఓ ఇంటి తాళం పగలకొట్టి చోరీకి పాల్పడి పోలీసులకు దొంగలు సవాల్ విసిరారు. సుమారు 10 సవర్ల బంగారం అపహరించారు. ఈ ఘటన సింగరాయకొండ మండల కేంద్రంలోని చేపల మార్కెట్ సమీపంలో ఉన్న అంబేడ్కర్ నగర్–4వ లైన్‌లో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఇంటి యజమాని బండి కృష్ణవేణి గుడ్లూరు మండలం పెదపవనిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త వెంకటేశ్వర్లు ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు. శుక్రవారం ఉదయం భార్యభర్తలిద్దరూ కలిసి గురుకుల పాఠశాలకు కారులో వెళ్లారు. అయితే, మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూడా తాళం వేసి ఉండటాన్ని ఆ ఇంటి పైపోర్షన్‌లో అద్దెకు ఉండేవారు చూశారు. కానీ, సాయంత్రం 4.30 గంటలకు తాళం పగలకొట్టి ఉండటాన్ని గమనించి వెంటనే చోరీ జరిగిన సమాచారాన్ని కృష్ణవేణికి తెలిపారు. వారు ఇంటికొచ్చి చూడగా బీరువాలోని దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. సుమారు 10 సవర్ల బంగారం చోరీ అయిందని గుర్తించారు. ఇంకా ఎంత మొత్తం చోరీ జరిగిందనే దానిపై ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో సంఘటన స్థలాన్ని పరిశీలించి పోలీసులు ఆధారాలు సేకరించారు.
బిర్యానీ రేటు దగ్గర గొడవ
● రెచ్చిపోయిన మందుబాబులు
ఒంగోలు టౌన్: నగరంలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. పీకలదాకా తాగి గొడవలకు దిగుతున్నారు. ఇటీవల త్రోవగుంట రోడ్డులోని ఒక రెస్టారెంటులో మద్యం బాబులు గొడవకు దిగగా.. శుక్రవారం సౌత్ బైపాస్‌లో రెచ్చిపోయారు. నగరంలోని ప్రగతి నగర్‌కు చెందిన కొందరు యువకులు సౌత్ బైపాస్‌లో రోడ్డు పక్కన బీఫ్ బిర్యానీ పాయింట్ దగ్గరకు వచ్చారు. బిర్యానీ తిన్న తరువాత రేటు విషయంలో నిర్వాహకురాలు మరియమ్మతో గొడవ పెట్టుకున్నారు. ఈ తతంగాన్ని గమనిస్తున్న అక్కడున్న వెల్డింగు షాపు నిర్వాహకుడు తంగిరాల ఏసురత్నం కల్పించుకున్నాడు. మహిళతో దురుసుగా ప్రవర్తించడం సరికాదని హితవు పలికాడు. దాంతో మద్యం మత్తులో వున్న యువకులు రెచ్చిపోయారు. మాకే నీతులు చెబుతావా అంటూ గొడవకు దిగారు. స్నేహితులతో వచ్చి ఏసురత్నం మీద దాడి చేశారు. గాయపడిన ఏసురత్నాన్ని ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోంది.

పట్టపగలు దొంగల హల్‌చల్