
రోడ్డెక్కిన అద్దె బస్సుల డ్రైవర్లు
● ఆన్ కాల్ డ్రైవర్లుగా అవకాశం ఇవ్వాలంటూ ధర్నా
● కనిగిరి డిపోలో నిలిచిపోయిన బస్సులు
కనిగిరి రూరల్: ఆన్ కాల్ డ్రైవర్లుగా బస్సులు నడిపేందుకు తమకు అవకాశం ఇవ్వకుండా కొత్తవారిని ఆహ్వానిస్తూ అద్దె బస్సుల యజమానుల మాట విని తమ దరఖాస్తులను తిరస్కరించడాన్ని నిరసిస్తూ కనిగిరిలో శుక్రవారం అద్దె బస్సుల డ్రైవర్లు రోడ్డెక్కి నిరసన తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపో పరిధిలో సుమారు 24 అద్దె బస్సులు తిరుగుతున్నాయి. ఆ బస్సుల్లో డ్రైవర్లుగా సుమారు 65 మంది పనిచేస్తున్నారు. వీరంతా దాదాపు 12 నుంచి 15 ఏళ్లుగా డ్రైవర్లుగా విధులు నిర్వర్తిస్తూ అన్ని విధాలుగా అనుభవం కలిగి ఉన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) వారు కనిగిరి డిపోలో ఆన్ కాల్ డ్రైవర్లుగా పనిచేసేందుకు అవుట్ సైడ్ డ్రైవర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆ దరఖాస్తుల స్వీకరణలో ఇప్పటికే అన్ని అర్హతలు కలిగి అనుభవం ఉన్న అద్దె బస్సుల డ్రైవర్ల దరఖాస్తులను తిరస్కరించారు. దీనిని వ్యతిరేకిస్తూ అద్దె బస్సుల డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లు విధులు బహిష్కరించి కనిగిరి డిపో ఆవరణలో ధర్నాకు దిగారు.
మాకు అన్యాయం చేయడం తగదు...
తమకు ఎప్పుడో ఒకసారి ఆర్టీసీలో అవకాశం లుగుతుందన్న ఆశతోనే సుమారు 15 ఏళ్లుగా ఆర్టీసీ అద్దె బస్సుల్లో డ్రైవర్లుగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నట్లు ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల యూనియన్ నాయకులు ఆంజనేయులు, రాజారావు తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం కనీసం తమ దరఖాస్తులను పరిగణలోకి తీసుకోకుండా అద్దె బస్సుల ఓనర్ల మాటలు విని తమను అన్యాయం చేయడం తగదని అన్నారు. అద్దె బస్సుల ఓనర్ల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని ఏళ్ల నుంచి డ్రైవర్లుగా వెట్టిచాకిరి చేస్తున్న తమకు అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. ఆన్‌కాల్ డ్రైవర్లుగా అద్దె బస్సుల డ్రైవర్లకు అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ అధికారులు కనీసం తమకు సమాధానం చెప్పడం లేదని వాపోయారు. అంతేగాకుండా ఎంతో ప్రశాంతంగా తాము నిరసన తెలుపుతుంటే పోలీసులతో దౌర్జన్యంగా బయటకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసేంత వరకు పోరాటం సాగిస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు భాస్కర్‌రెడ్డి, సుందరయ్య, మహీంధ్ర, శ్రీనివాసులు, యలమందారెడ్డి, ఖాజా, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డెక్కిన అద్దె బస్సుల డ్రైవర్లు