
కృష్ణమ్మ పరవళ్లతో పారవశ్యం..!
● శ్రీశైలం డ్యాంకు పెరిగిన సందర్శకులు
● పెద్దదోర్నాల గణపతి ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద అధిక సంఖ్యలో వాహనాలు
పెద్దదోర్నాల: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో 8 గేట్లను ఎత్తి దిగువనున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం డ్యాంను సందర్శించేందుకు, శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు పర్యాటకులు, భక్తులు భారీగా శ్రీశైలం తరలివెళ్తున్నారు. దీంతో పాటు శ్రావణ శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో వాహనాలలో భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తరలివెళ్లారు. శుక్రవారం పెద్దదోర్నాల మండల పరిధిలోని నల్లమల ఘాట్ రోడ్లలో వాహనాల రద్దీ మరింత పెరిగింది. ఒకవైపు మల్లన్న కొలువుదీరిన శ్రీశైలం పుణ్యక్షేత్రం భక్తులకు కొంగుబంగారంగా వెలుగొందుతుండగా.. మరోవైపు భ్రమరాంభా మల్లికార్జునుల పాదపద్మాలను స్పృశిస్తూ ప్రవహించే కృష్ణా నదిపై నల్లమల అభయారణ్యంలో నిర్మించిన బహుళార్థక నీలం సంజీవరెడ్డి శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడం మరింత శోభను చేకూరుస్తోంది. వీటన్నింటికీ నల్లమల అందాలు తోడయ్యాయి. ఇటీవల డ్యాం ఎగువ భాగంలో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. డ్యాంకు వరద ప్రవాహం అధికంగా ఉండటంలో నాలుగు రోజులుగా డ్యాం గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో డ్యాం వద్ద నీరు దిగువకు జాలువారుతున్న సుందర దృశ్యాలను చూసేందుకు సందర్శకులు భారీగా శ్రీశైలం డ్యాంసైట్‌కు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దదోర్నాల మండల పరిధిలోని నల్లమల ఘాట్‌రోడ్డులో, గణపతి ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద వాహనాలతో రద్దీ వాతావరణం నెలకొంది. దీంతో పాటు కొద్దిరోజులుగా నల్లమల అటవీప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో చెట్లన్నీ చిగురించి పచ్చదనంతో పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఈ దృశ్యాలన్నీ చూసేందుకు పలు ప్రాంతాలకు చెందిన సందర్శకులు ప్రత్యేక వాహనాలలో శ్రీశైలం తరలివెళ్తుండటంతో రద్దీ ఏర్పడింది.

కృష్ణమ్మ పరవళ్లతో పారవశ్యం..!