
రెచ్చిపోయిన మందుబాబులు
ఒంగోలు టౌన్: నగరంలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. పీకలదాకా తాగి గొడవలకు దిగుతున్నారు. ఇటీవల త్రోవగుంట రోడ్డులోని ఒక రెస్టారెంటులో మద్యం బాబులు గొడవకు దిగగా.. శుక్రవారం సౌత్ బైపాస్‌లో రెచ్చిపోయారు. నగరంలోని ప్రగతి నగర్‌కు చెందిన కొందరు యువకులు సౌత్ బైపాస్‌లో రోడ్డు పక్కన బీఫ్ బిర్యానీ పాయింట్ దగ్గరకు వచ్చారు.
బిర్యానీ తిన్న తరువాత రేటు విషయంలో నిర్వాహకురాలు మరియమ్మతో గొడవ పెట్టుకున్నారు. ఈ తతంగాన్ని గమనిస్తున్న అక్కడున్న వెల్డింగు షాపు నిర్వాహకుడు తంగిరాల ఏసురత్నం కల్పించుకున్నాడు. మహిళతో దురుసుగా ప్రవర్తించడం సరికాదని హితవు పలికాడు.
దాంతో మద్యం మత్తులో వున్న యువకులు రెచ్చిపోయారు. మాకే నీతులు చెబుతావా అంటూ గొడవకు దిగారు. స్నేహితులతో వచ్చి ఏసురత్నం మీద దాడి చేశారు. గాయపడిన ఏసురత్నాన్ని ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోంది.