రోడ్డు ప్రమాదానికి గురైన కానిస్టేబుల్ షాజిద్
తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి
గుండెపోటుతో అంబులెన్స్‌లోనే మృతి చెందిన తల్లి
కందుకూరు: గుండెపోటుకు గురైన తల్లిని కాపాడుకోవాలని వెళ్తున్న కొడుకు రోడ్డు ప్రమాదానికి గురై.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ తానూ మృతి చెందిన విషాద ఘటన సోమవారం అర్ధరాత్రి ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని కోటారెడ్డినగర్ జంక్షన్‌లో జరిగింది. వివరాల్లోకెళ్తే.. సంతోష్ నగర్‌కు చెందిన షాజిద్ అనే కానిస్టేబుల్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సోమవారం సెంట్రీ డ్యూటీ ఉండడంతో స్టేషన్‌లోనే ఉన్నాడు. ఈ సమయంలో ఆయన తల్లి సమీమ్(60) ఆరోగ్యం బాగా లేదంటూ ఇంటి దగ్గర నుంచి ఫోన్ రావడంతో హడావుడిగా ఇంటికి వెళ్లాడు.
అప్పటికే తల్లి ఆయాసంతో తీవ్రంగా ఇబ్బంది పడుతుండడంతో.. తన ద్విచక్ర వాహనంపై దగ్గరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించాడు. అయితే అక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో అంబులెన్స్‌లో మరో హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ముందుగానే హాస్పిటల్‌కు వెళ్లి అక్కడి వైద్యులను సంప్రదించాలనే ఉద్దేశంతో షాజిద్ తన బైక్‌పై కోటారెడ్డి హాస్పిటల్‌కు బయలుదేరాడు. షాజిద్‌ను అనుసరిస్తూ వెనుక వైపు అంబులెన్స్ వస్తున్న క్రమంలో.. కోటారెడ్డినగర్ జంక్షన్ వద్ద మలుపు తిరుగుతుండగా, సింగరాయకొండ వైపు నుంచి వేగంగా వస్తున్న బైక్ షాజిద్ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో షాజిద్ తలకు తీవ్రగాయాలయ్యాయి.
ఈ లోపు తల్లి సమీమ్‌ను తరలిస్తున్న అంబులెన్స్ హాస్పిటల్‌కు చేరుకుంది. సమీమ్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం అదే అంబులెన్స్‌లో తీవ్రగాయాలైన షాజిద్‌ను ఒంగోలులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ షాజిద్ మృతి చెందాడు. కాగా, కోటారెడ్డినగర్ జంక్షన్‌లో జరుగుతున్న పనుల వద్ద కాంట్రాక్టర్ ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివనాగరాజు తెలిపారు.


