ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి
ఒంగోలు సిటీ: పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పాత జెడ్పీ సమావేశ మందిరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు/ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 165 కేంద్రాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు, 14 కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సూచనలు, నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో అవసరమైన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించినట్లు వెల్లడించారు. పరీక్షల సమయంలో మాల్ ప్రాక్టీస్‌ను నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు పరీక్ష ప్రారంభ సమయానికి కనీసం గంట ముందుగా హాజరుకావాలని సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్, అవసరమైన స్టేషనరీ తెచ్చుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడం నిషేధించబడినట్లు తెలిపారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందుగానే హాలులో విద్యార్థులను కూర్చోబెట్టాలని, హాల్ టికెట్లు సరిచూసి మాత్రమే పరీక్ష హాలులోకి అనుమతించాలని అధికారులు, సిబ్బందికి ఆర్జేడీ స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి సమస్యలు ఎదురైనా తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మార్కాపురం జిల్లా పరీక్షల పరిశీలకులు ఎన్.గీత, జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక, ఒంగోలు, మార్కాపురం ఉప విద్యాశాఖాధికారులు ఏ చంద్రమౌలీశ్వర్, శ్రీనివాసులు, అసిస్టెంట్ కమిషనర్ ఎం.శ్రీనివాసరావు, ఒంగోలు మండల విద్యాశాఖాధికారి టి.కిషోర్‌బాబు, మండల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.


