● అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ నెల 8వ తేదీ ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. ఆ దిశగా ఏర్పాట్లు చేసేందుకు సంబంధిత అధికారులతో శుక్రవారం స్థానిక ప్రకాశం భవనంలోని తన చాంబర్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. జిల్లాస్థాయిలో 3000 మందితో, నియోజకవర్గ స్థాయిలో 500 మందితో ఈ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినందున నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. వివిధ రంగాలలో విజయం సాధించిన మహిళలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయడంతో పాటు వారి విజయాలను వీడియో రూపంలో చిత్రీకరించి ఆయా కార్యక్రమా ల్లో ప్రదర్శించే ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ బి.చిన ఓబులేసు, డీఆర్‌డీఏ పీడీ నారాయణ, మెప్మా పీడీ ఆనంద్ సత్యపాల్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ఒంగోలు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


