మార్కాపురం జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలకు అందని మార్చి నెల రేషన్ వారం రోజులు కావస్తుండటంతో కార్డుదారుల్లో మొదలైన టెన్షన్ చంద్రబాబు ప్రభుత్వ తీరుపైసర్వత్రా నిరసన
మార్కాపురం: మార్చి నెల ప్రారంభమై ఆరు రోజులు దాటినా మార్కాపురం జిల్లాలో కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వం పనితీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల రేషన్ ఇస్తారో..ఇవ్వరోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కనీసం స్టేజీ 1 నుంచి గోడౌన్‌లకు, అక్కడి నుంచి డీలర్ల వద్దకు నేటికీ రేషన్ సరఫరా పూర్తి కాలేదు. మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ.. దానిపై ఎవరికీ స్పష్టత లేదు. దీంతో కూటమి ప్రభుత్వం, పాలకులు, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పౌరసరఫరాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందంటూ విమర్శిస్తున్నారు. స్టేజీ 1లోనే బియ్యం పంపిణీ జరగడం లేదని అధికారులు చెబుతున్న మాటలను ప్రజలు నమ్మడం లేదు. 1వ తేదీ నుంచి రోజూ రేషన్ షాపులకు ప్రజలు వెళ్తుండగా, ఇంకా బియ్యం రాలేదని డీలర్లు చెబుతున్నారు.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ...
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాల ద్వారా 1వ తేదీనే ఇంటివద్దకు వెళ్లి రేషన్ సరుకులైన బియ్యం, చక్కెర, కందిపప్పు, గోధుమపిండి సరఫరా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను రద్దు చేయడంతో మళ్లీ రేషన్ షాపుల వద్దకు సుదూరం వెళ్లి సరుకులు తీసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం బియ్యం సరఫరా చేయకుండా చేతులెత్తేయడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మార్కాపురం జిల్లాలో సుమారు 170 షాపులకు రేషన్ పంపిణీ జరగాల్సి ఉంది. ముఖ్యంగా మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు ఇంకా రేషన్ చేరలేదు. దీంతో కార్డుదారులకు అందాల్సిన సరుకులు అందలేదు. స్టేజీ 1లో ప్రతి నెలా మచిలీపట్నం, గుండ్లాపల్లి తదితర ప్రాంతాల నుంచి లారీల ద్వారా ఎంఎల్‌ఓ పాయింట్లకు బియ్యం వస్తాయి. అక్కడి నుంచి రేషన్ షాపులకు లారీల ద్వారా సరఫరా చేస్తారు. ఈ ప్రక్రియ ప్రతి నెలా 20 నుంచి 25 తేదీల మధ్య పూర్తవుతుంది. ఆ తర్వాత రేషన్ షాపులకు చేరితే ఒకటో తేదీ నుంచి రేషన్ పంపిణీ చేస్తారు. అయితే కూటమి నేతల జోక్యంతో బియ్యం పక్కదారి పడుతున్న విషయం బహిరంగం కాగా, ప్రభుత్వమే ఆలస్యంగా సరఫరా చేయడం గమనార్హం. జిల్లాలో దాదాపు లక్ష రేషన్ కార్డుదారులకు బియ్యం చేరాల్సి ఉంది.
బియ్యం కోసం ఎదురుచూపులు...
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాణ్యమైన సన్నబియ్యాన్ని ఇంటివద్దనే అందించడంతో ప్రజలు సంతోషంగా ఏ టెన్షన్ లేకుండా తీసుకునేవాళ్లు. కూటమి ప్రభుత్వంలో పౌరసరఫరాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో మార్చి 6వ తేదీ దాటినా ఇంకా రేషన్ పంపిణీ ప్రారంభం కాలేదు. గత బుధవారం మార్కాపురం ఎంఎల్‌ఓ పాయింట్‌కు 60 టన్నుల బియ్యం మాత్రమే రాగా.. వాటిని కొన్ని షాపులకు పంపారు. గురువారం కూడా పూర్తిస్థాయిలో రాలేదు. గురువారం సాయంత్రానికి జిల్లాలోని కొన్ని రేషన్ షాపులకు మాత్రమే బియ్యం పంపారు. ఇంకా సుమారు 300 టన్నుల బియ్యం ఎంఎల్‌ఓ గోడౌన్ పాయింట్‌కు రావాల్సి ఉంది. అధికారులు మాత్రం జిల్లా విభజన వలన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయడంలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. రెండుమూడు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంటున్నారు. ఏదిఏమైనా నిత్యావసర వస్తువులు అందకపోవడంతో కార్డుదారులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
మార్కాపురం జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు 3,34,528
మొత్తం రేషన్ షాపులు
743


