సన్‌.. ధనాధన్‌..! | - | Sakshi
Sakshi News home page

సన్‌.. ధనాధన్‌..!

Mar 7 2026 9:30 AM | Updated on Mar 7 2026 9:30 AM

మార్చి మొదటి వారంలోనేసూర్య ప్రతాపం రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మార్కాపురంలో మూడు రోజులుగా 39 డిగ్రీల నమోదు

మార్కాపురం: మార్చి నెల ఇలా వచ్చిందో లేదో.. అప్పుడే వేసవి కాలం మొదలైపోయింది. ఒక్కసారిగా సూర్య ప్రతాపం పెరిగిపోయింది. గడిచిన వారం రోజులుగా రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. మార్కాపురం ప్రాంతంలో గత నాలుగు రోజుల నుంచి ఎండ వేడమి అధికంగా ఉంటోంది. ఈ ఏడాది మార్చి మొదటి వారం నుంచే ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో మున్ముందు ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఏప్రిల్‌ 2వ వారం నుంచి ఎండ తీవ్రత పెరుగుతుంటుంది. ఈ ఏడాది అనూహ్యంగా మార్చి మొదటివారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. గత మూడు రోజుల నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు విపరీతంగా కాస్తుండటంతో మధ్యాహ్నం 12 గంటలకే రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈసారి నెల రోజులు ముందుగానే వేసవి వచ్చి ప్రజలను కలవరపరుస్తోంది. మార్చి నెల ప్రారంభం నుంచే ఎండలు అధికంగా ఉండటంతో ప్రజలు బిత్తరపోతున్నారు. ఇప్పుడే ఇవేం ఎండలు బాబోయ్‌ అనుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని వేసవి కాలంలో ప్రత్యేకంగా వ్యాపారాలు చేసేవారు సైతం అప్పుడే రంగంలోకి దిగారు. పుచ్చకాయలు, శీతల పానియాలు, కొబ్బరిబోండాల వంటి వ్యాపారాలు పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు అసలు వేసవి ఎండలు మే నుంచా.. లేకుంటే మార్చి నుంచా అని చర్చించుకుంటున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఒంటి పూట బడులు ప్రారంభం కాకపోవడం, అప్పుడే ఎండ తీవ్రత పెరగడంతో పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. మార్కాపురంలోని పాత బస్టాండు, కోర్టు సెంటర్‌, కంభం సెంటర్‌, దోర్నాల సెంటర్‌, తదితర ప్రాంతాలన్నీ శుక్రవారం మధ్యాహ్నం 12.30 నుంచి నిర్మానుష్యంగా కనిపించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement